తెలంగాణ విద్యుత్ ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ ఎక్స్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ట్వీట్ చేశారు. ‘‘కరెంట్ కోతల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతి పక్షాలు, విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. విద్యుత్ రంగ వైఫల్యాలకు నేనే భాద్యుడిని అన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది’’ అని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి వైఖరి ఆడ రాక పాత గజ్జెలు అనే సామెతను గుర్తు చేస్తుందని సెటైర్లు వేశారు హరీశ్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వం, 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు.. విద్యుత్ ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన వ్యవస్థను నిర్మించింది. రెప్పపాటు కాలం కూడా కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపింది. కేవలం 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను కుప్ప కూల్చింది. గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు సరిపోయే విద్యుత్ సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైంది’’ అని హరీశ్ రావు అన్నారు.