ఈ నెల 26న హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 6 నుంచి రెండు నెలల పాటు పాదయాత్ర ఉంటుందని, హాత్ సే హాత్ జోడోలో భాగంగా పాదయాత్ర చేస్తానని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. భద్రాచలం నుంచి తాను పాదయాత్రను ప్రారంభిస్తానని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. భద్రాచలంలో భారీ బహిరంగ సభకు ప్రియాంకాగాంధీ హాజరవుతారని, ఠాక్రే భేటీకి మూడుసార్లు రాని నేతల నుంచి వివరణ తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పారు. కీలక సమయాల్లో సమావేశాలకు రాని నేతలను పార్టీ నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
పాదయాత్ర చేపట్టే విధానం, అనుసరించాల్సిన వ్యూహాలపై మాణిక్ రావు ఠాక్రే నేతలకు దిశా నిర్దేశం చేశారు. రేవంత్ రెడ్డి కనీసం 50 నియోజకవర్గాలకు తగ్గకుండా పాదయాత్ర చేయాలని… మిగతా సీనియర్లు 20 నుంచి 30 నియోజకవర్గాల్లో యాత్ర చేపట్టాలని ఠాక్రే సూచించినట్లు సమాచారం. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నేతలంతా కలిసి పనిచేయాలని… యాత్రను విజయవంతం చేయాలని కోరినట్లు తెలుస్తోంది. సమస్యలు ఉంటే తనతో చెప్పాలని.. లీడర్లు అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఠాక్రే హామీ ఇచ్చారని సమాచారం. నేతలు ఎవరైనా తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించవచ్చని… అయితే అవి పార్టీకి నష్టం చేసేలా ఉండకూడదని మాణిక్ రావు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.