రాష్ట్రంలో దంచికొట్టిన వాన.. పొంగుతున్న జలాశయాలు

-

తెలంగాణ వ్యాప్తంగా మూడ్రోజులుగా ఎడతెరిపిలేని వాన కురుస్తోంది. ఏకధాటి వర్షంతో రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టుల్లోకి మరోసారి వరద ప్రవాహం పోటెత్తుతోంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో ప్రాజెక్టులు నిండుకుండలుగా మారాయి. శ్రీరాంసాగర్, కడెం జలశయాల నుంచి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు మళ్లీ వరద ఉద్ధృతి పెరిగింది.

శ్రీరామసాగర్‌కు ఎగువ నుంచి వరద రాక క్రమంగా పెరిగింది. శనివారం 71 వేల క్యూసెక్కుల వరద రాగా.. 24 గంటల్లో 1.75 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. ఆదివారం ఉదయం సమయంలో రెండు లక్షల క్యూసెక్కుల విడుదల ఉండగా సాయంత్రానికి 1.57 లక్షల క్యూసెక్కులు నమోదయింది. మానేరు, ప్రాణహిత, ఇతర ప్రవాహాలు కలిపి లక్ష్మీ(మేడిగడ్డ) వద్ద వరద పెరుగుతోంది. బ్యారేజీ 70 గేట్లు ఎత్తి దిగువకు 5.05 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సమ్మక్క సాగర్‌ దిగువన కూడా నదిలో ప్రవాహం పెరుగుతోంది.

భద్రాద్రి జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద ఆరు గంటల సమయంలో నదిలో 37.19 అడుగుల మట్టం నమోదయింది. ఉదయం 9 గంటలకు 33.94 అడుగులు ఉండగా సాయంత్రానికి దాదాపు నాలుగు అడుగుల మేర మట్టం పెరిగింది. మరోవైపు కృష్ణా నదిలో ఆలమట్టి, నారాయణపూర్‌ల నుంచి వరద దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం ఆరు గేట్లు, నాగార్జునసాగర్‌ పది గేట్ల ద్వారా విడుదల కొనసాగుతోంది.

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రాత్రి 8 గంటలకు ఎగువన ఉన్న కడెం, శ్రీరామ సాగర్‌(ఎస్సారెస్పీ)లతో పాటు పరీవాహక ప్రాంతాల నుంచి 5.55 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా 40 గేట్లు ఎత్తి 5.54 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news