అధికార పెద్దలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, రాజధాని ఆవశ్యకతను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు రాజధాని రైతులు చేస్తున్న మహాపాదయాత్ర 2.0 ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. రాజధానిలోని టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అరసవెల్లి సూర్యదేవుని సన్నిధి వరకు జరిగే యాత్ర కోసం రైతులు, రైతుకూలీలు ఉత్సాహంతో ఉన్నారు. ఇవాళ ఉదయం నుంచి ప్రారంభమయ్యే యాత్ర 60 రోజుల పాటు సాగనుంది. తమకు జరిగిన అన్యాయాన్ని జనంలోకి తీసుకెళ్లటంతో పాటు.. అమరావతి ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయటమే లక్ష్యంగా పాదయాత్ర జరుగుతుందని రైతులు చెబుతున్నారు.
మూడు రాజధానుల ప్రకటన వెలువడిన వెంటనే దాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు ప్రారంభించిన ఉద్యమం ఇవాళ్టితో వెయ్యి రోజులకు చేరుతుంది. అమరావతి అభివృద్ధి చెందితే ఆ ఫలాలు రాష్ట్ర ప్రజలందరికీ అందుతాయని.. అంతిమంగా ఆంధ్రప్రదేశ్ పురోగతి సాధించనుందని వివరించనున్నారు. రాజధానిలోని 29 గ్రామాల నుంచి రైతులు, రైతు కూలీలు, మహిళలు, అన్ని వర్గాలవారు విడతలవారీగా ఇందులో పాల్గొననున్నారు.