తెలంగాణ, ఏపీల్లో నైరుతి రుతు పవనాలు విస్తరించడంతో మరో 2 వారాల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతన్నలకు నిజంగా ఇది శుభవార్తే. ఎందుకంటే.. నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఏపీలో విస్తరించాయి. దీంతో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. గత 2, 3 వారాలుగా వర్షం కోసం రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న నేపథ్యంలో వరుణుడు వారిని కరుణించాడు. దీంతో ఖరీఫ్ సీజన్‌కు ఇక ఢోకా లేదని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ, ఏపీల్లో నైరుతి రుతు పవనాలు విస్తరించడంతో మరో 2 వారాల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జూలై 4వ తేదీ వరకు తెలంగాణలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, అలాగే జూలై 15వ తేదీ వరకు ఏపీలో వర్షాలు ఉంటాయని వారు చెప్పారు. కాగా ఈ సారి తెలంగాణలో 97 శాతం వరకు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు ఏపీలో మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కానీ రాయలసీమలో మాత్రం సాధారణ వర్షాలేనని వారు చెప్పారు. అయితే మరో 2 వారాల అనంతరం దేశ వ్యాప్తంగా రుతు పవనాలు విస్తరించి అన్ని ప్రాంతాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జూలై 15వ తేదీ లోపు దేశమంతటా నైరుతి పవనాలు విస్తరించి వానలు పడనున్నాయని వారు తెలిపారు. ఏది ఏమైనా.. కొంచెం ఆలస్యమైనా అన్నదాతకు తీపి కబురు అందండంతో వారు ఎంతో సంతోష పడుతున్నారు..!