టీడీపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు త్వరలో బీజేపీలో చేరనున్నారని తెలుస్తుండగా.. వారికి ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు నాయకత్వం వహిస్తున్నారని తెలిసింది.
టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరే సరికి ఏపీలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు యూరప్‌లో ఉండడం, మరోవైపు ఏపీలో ఆ పార్టీ నేతలు బీజేపీలో చేరేందుకు క్యూ కడుతుండడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఇప్పటికే నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరినా.. అతి త్వరలోనే మరో భారీ షాక్ టీడీపీకి తగలనుందని తెలుస్తోంది. అది.. ఆ పార్టీ ఎమ్మెల్యేల రూపంలో కావడం విశేషం..
టీడీపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు త్వరలో బీజేపీలో చేరనున్నారని తెలుస్తుండగా.. వారికి ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు నాయకత్వం వహిస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే గంటా.. సుజనా చౌదరితో టచ్‌లో ఉన్నారని, ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే గంటా.. టీడీపీ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చేందుకు పావులు కదుపుతున్నట్లు తెలిసింది.
అయితే ప్రస్తుతం గంటా శ్రీనివాస రావు శ్రీలంక పర్యటనలో ఉన్నారు. దీంతో ఆయన ఏపీకి రాగానే ఈ విషయం పట్ల స్పష్టత అవకాశం ఉన్నట్లు తెలిసింది. అయితే ఓ వైపు గంటా తాను బీజేపీలో చేరుతున్నానని వస్తున్న వార్తలను ఖండించారు. అయినప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారే అంశంపై మాత్రం జోరుగా ప్రచారం సాగుతోంది. కాగా టీడీపీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్ (విశాఖ దక్షిణం), అన్నంగి సత్యప్రసాద్ (రేపల్లె), డోలా బాల వీరాంజనేయ స్వామి (కొండెపి), వల్లభనేని వంశీ మోహన్ (గన్నవరం) తోపాటు గంటా కూడా బీజేపీలో చేరవచ్చని తెలుస్తోంది.
ఇక గంటాతోపాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు తాము బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని ఓ ఆంగ్ల పత్రికకు చెప్పారని, ఆ పత్రిక కథనం రాయడం కూడా సంచలనం కలిగిస్తోంది. వీలైనంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్పించేందుకు గంటా యత్నిస్తున్నట్లు సమాచారం. కాగా ఫిరాయింపుల చట్టం నిబంధనలు వర్తించకుండా ఉండాలంటే.. మూడింట కనీసం రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీ మారాలి. అంటే.. కనీసం 16 నుంచి 17 మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి బీజేపీలో చేరితే పార్టీ ఫిరాయింపులు వర్తించవు. ఈ క్రమంలో ఆ స్థాయిలో టీడీపీ ఎమ్మెల్యేలను గంటా బీజేపీలో చేర్పిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.
కాగా గంటా శ్రీనివాస రావు వ్యాపారవేత్తగా ఉండి ఇప్పటి వరకు మూడు పార్టీలు మారారు. టీడీపీలో మొదట పనిచేశాక తరువాత ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు. అనంతరం కాంగ్రెస్‌లో.. ఆ తరువాత ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. ఇక త్వరలో ఆయన బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా బీజేపీ జాతీయ నాయకులతో గంటా టచ్‌లో ఉన్నారని.. ఇక కొద్ది రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని తెలుస్తోంది. ఒక వేళ నిజంగానే 16 మంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడితే అది ఆ పార్టీ శరాఘాతం అవుతుందనే చెప్పవచ్చు..!