నైరుతి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో.. ఐఎండీ ఏపీకి వర్ష సూచన చేసింది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో ఇదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది ఐఎండీ. ఇది క్రమంగా వాయవ్య దిశగా పయనించి తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వైపు వస్తుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 11, 12 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది ఐఎండీ. కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కూడా పడతాయని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర తీరంలో 65 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని ఐఎండీ పేర్కొంది.
ఉత్తర కోస్తాంధ్రా, యానాంలో నవంబర్ 8వ తేదీ, 9, 10న వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. అలాగే అటు దక్షిణ కోస్తాంధ్రాలో ఈరోజు, రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురుస్తాయని.. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో సంభవించే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
రాయలసీమలో ఈరోజు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.