తెలుగు రాష్ట్రాల్లోకి రావడానికి మొండికేసిన నైరుతి రుతుపవనాలు.. నిన్ననే తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల రాకతో హైదరాబాద్ నగరంలో బుధవారం ఉదయం ఓ మోస్తరు వర్షం కురిసింది. అయితే దీంతో నగరం చల్లబడటంతో.. హైదరాబాద్‌వాసులకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. ఇక మధ్యాహ్న సమయంలో ఎండ దంచికొట్టింది.
ఇక ఇవాళ రాత్రికి కూడా హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. నగరంతో పాటు సమీపంలో ఉన్న జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. యాదాద్రి, జనగామ, నల్లగొండ, మేడ్చల్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఇప్పటికే భారీ వర్ష సూచన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ శాఖ సిబ్బందిని అప్రమత్తం చేసింది.