గత కొద్దిరోజులుగా వాతావరణం భిన్నంగా ఉంటోంది. ముఖ్యంగా తెలంగాణలో పగటి పూట ఎండలు మండిపోతుంటే.. సాయంత్రం కాగానే చిరుజల్లులు చల్లగా పలకరిస్తున్నాయి. అయితే పలు జిల్లాల్లో మాత్రం వడగండ్లు కురుస్తూ రైతులకు తీవ్ర నష్టం మిగుల్చుతున్నాయి. ఇవాళ కూడా భాగ్యనగరం ఉన్నట్టుండి చల్లబడింది. నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
నగరంలోని వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. భానుడి భగభగలు పోయి సూర్యుడిని మేఘాలు కమ్మేశాయి. క్లైమేట్ కూల్ అయిందని సంబురపడే లోగా చిరుజల్లులు పలకరించాయి. నగరంలోని చందానగర్, లింగంపల్లి, మియాపూర్, మదీనాగూడ, కూకట్‌పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, దుండిగల్, గండిమైసమ్మ, మేడ్చల్, బహదూర్‌పల్లి, గగిల్లాపూర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాన కురవడంతో నగరంలోని రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు, పాదాచారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షంలోనే తడుచుకుంటూ ద్విచక్ర వాహనాలపై వెళుతున్నారు. ఆఫీసుల నుంచి బయటకు వచ్చే సమయం కావడంతో చాలా మంది ఉద్యోగులు వానలో తడుస్తూ తమ ఇళ్లకు పయనమవుతున్నారు.