రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. నగరానికి సోమవారం రాత్రి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సిటీలో మధ్యాహ్నం నుండే పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.ఇవాళ రాత్రి కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ ఈదురు గాలులతో పాటు ఉరుములు పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది. అవసరం ఉంటేనే బయటకు రావాలని హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది.
సాయంత్రం హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో నగరంలో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షపు నీరు రోడ్లకు మీదకు చేరడంతో సిటీలో కిలో మీటర్ల మేర వెహికల్స్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతేనే ఇండ్ల నుండి బయటకు రావాలని ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు.