రాష్ట్ర వాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైకుంఠ ఏదశిని పురస్కరించుకుని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారిని ఉత్తర ద్వారం దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. దీంతో భద్రాచలం, యాదాద్రి, ధర్మపురి, సిద్దిపేట, హైదరాబాద్‌లోని పలు వైష్ణవ ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజామున తొలి పూజల అనంతరం స్వామివారు ఉత్తరద్వార దర్శనమిస్తున్నారు. దీంతో భక్తులు ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్లు నిండిపోవడంతో స్వామి వారి దర్శనానికి రెండు గంటలు పడుతున్నది.
ఏపీలోనూ భక్తులు ఈ తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు. తిరుమల, అన్నవరం, ద్వారకా తిరుమల, మంగళగిరి, విజయవాడ, అనంతపురం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తిరుమలలో అర్ధరాత్రి 12.05 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. మొదట వీవీఐపీలు, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 గంటల నుంచి ఆరు గంటల వరకు శ్రీవాణి ద్వారా టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించారు. కాగా, తిరుమలలో ఈ నెల 11 వరకు వైకుంఠ ద్వారం ద్వారా భక్తులను అనుమతిస్తారు.