బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం : చంద్రబాబు

-

కొత్త సంవత్సరం తొలిరోజు గుంటూరులో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉయ్యూరు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. కానుకల పంపిణీకి శ్రీకారం చుట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించిన అనంతరం వెళ్లిపోయారు. ఆ తర్వాత సభా ప్రాంగణం వెలుపల లారీల్లో ఉంచిన కానుకలను పంచుతుండగా.. ఒకేసారి అందరూ ఎగబడ్డారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగి.. గుంటూరు ఏటీ అగ్రహారం నాలుగో లైనులో పోలేరమ్మ గుడి సమీపంలో ఉండే గోపిదేశి రమాదేవి(50) అక్కడికక్కడే మృతి చెందింది. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ నగరంపాలెం గొర్రెలదొడ్డికి చెందిన సయ్యద్‌ అతీఫా(45), మారుతీనగర్‌ మూడో లైనుకు చెందిన షేక్‌ బీబీజాన్‌ (50) మరణించారు. ఈ ఘటనపై చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేదలకు కానుకలు ఇచ్చేందుకు ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో తాను పాల్గొన్నానని చెప్పారు. కార్యక్రమం ముగిసిన తరువాత తాను వెళ్లిపోయిన అనంతరం జరిగిన ఘటనలో ముగ్గురు చనిపోవడం బాధాకరం అని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

 

పేదలకు ఆ స్వచ్ఛంద సంస్థ చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించాలి అనే ఆలోచనతో తాను కార్యక్రమానికి వెళ్లాను అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని… ఘటన దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు టీడీపీ అధినేత ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news