నాన్నల దినోత్సవం అయిపోయిందా ? ఎప్పుడు ? ఎక్కడ ? బిడ్డల కోసం తపించే నాన్నలు ఎందరో కదా ! వారికి మనం జేజేలు చెబుతూ.. మరో సారి ఈ ఆత్మీయ అనుబంధాన్ని స్మరించాలి. ఆజన్మాంతం బిడ్డల కోసం జీవితాన్ని త్యాగం చేసిన నాన్నల గొప్పదనం గుర్తించాలి. ఇవాళ ముద్దుల వీరుడు అని అందరూ చెప్పుకునే ఇమ్రాన్ హష్మీ జీవితాన ఓ ఆసక్తిదాయక సంఘటన
మీ కోసం.
K ..I..S..S.. : తెరనిండా ముద్దులు.. నాలుగు పెదాల సయ్యాటలు.. ఆట కదా! అలానే ఉంటుంది. కొంత తీపి కొంత చేదుతో నిండిపోయి ఉంటుంది. సినిమా కోసం ఇచ్చిన ముద్దు కొన్ని కోట్ల మందికి నయనానందాన్ని ఇచ్చింది. ఎస్.. ఐ థింక్ ఇట్స్ ఎ ఐ ఫీస్ట్.
L..I..F..E.. : ముద్దూ.. ముచ్చట్లతో పాటు పాల పొంగు కోపాలు.. పైట చెంగు తాపాలు.. అలకలు.. ఆరళ్లు.. వీటితో పాటు మరికొన్ని. ఆర్క్ దీపాల వెలుగులను ఎంజాయ్ చేస్తున్నప్పుడు తెలియలేదు అతడికి రొమాన్స్ ఒక్కటే కాదు..
జీవితం అంటే అనేకానేక భరింపరాని భావోద్వేగాల సమ్మిళితం అని…
KISS OF LIFE : అంటే… ఇమ్రాన్ హష్మీ (ముద్దుల వీరుడు, సిరియల్ కిస్సర్ ) ని అడగండి చెబుతాడు. తన కన్నీటి చారికల వెనుక ఉన్న గాథని వివరిస్తాడు. క్యాన్సర్ మహమ్మారి బారిన పడిన తన కొడుకుని ఏ విధంగా కాపాడుకున్నాడో కళ్లకు కడతాడు. రండి ఇవాళ నాన్నల దినోత్సవం కదా! వెలుగు చీకట్ల తార్లాట గురించి తెలుసుకుందాం. ఇమ్రాన్ హష్మీ ఇన్ సైడ్ లైఫ్ స్టోరీ..క్లుప్తంగా..
ఆస్పత్రి.. ఇమ్రాన్ కి పెద్దగా అవసరం పడని పరిసరమది. షూటింగ్‌లు.. తన ఇమేజ్‌ని క్యాష్ చేసుకునే దర్శక నిర్మాతలు, ముద్దులు.. ముద్దుగుమ్మలు..ముద్దు”గుమ్మ
డాక్టర్.. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చాడు. ఇమ్రాన్ కొడుకు అయాన్ సేఫ్ అని చెప్పాడు. కిడ్నిలో ఉన్న క్యాన్సర్ కణితి తొలగించేశామని..మరికొద్ది రోజులు కిమో చేస్తే వ్యాధి పూర్తిగా నయం అవుతుందన్నాడు. హ..మ్మ..య్య.. తన ప్రార్థనలు ఫలించాయి. క్యాన్సర్ ని ప్రాథమిక దశలో గుర్తిస్తే ఆ..మహమ్మారిని తన చిన్నారి దేహపు సరిహద్దుల నుంచి తరిమికొట్టవచ్చని ఇదివరకు తను చదివిన అధ్యయనాలు ఫలించాయి. వీటన్నింటికీ మించి ప్రయత్నం ఫలించింది. అయాన్ నౌ సేఫ్. అంతకుముందు….
అభంశుభం తెలియని ప్రాయమది. రోజూ ఇంజక్షన్లు.. ట్యాబ్లెట్లు.. వద్దన్నాడా పిల్లవాడు. అది విని చూసి తల్లడిల్లిపోయాడు ఇమ్రాన్. రోజుకో అబద్ధం చెప్పి.. బుజ్జాయికి నిజం తెలియకుండా జాగ్రత్తపడుతూ తన కంటిపాపలాంటి కొడుకుని కాపాడుకునేందుకు ఎంతగానో పరితపించాడు. వేళకు మందులు వేసుకోనని మారాం చేస్తే తానెక్కడ ఉన్నా విషయం తెలుసుకుని అయాన్ ని తన దారికి తెచ్చుకున్నాడు. రెండేళ్ల క్రితమైతే తన కొడుకుకి ఫోన్ చేసి “నేను బ్యాట్ మన్ ని మాట్లాడుతున్నా నువ్వు నాలా సూపర్ హీరో కావాలంటే వేళకి ట్యాబెట్లు వేసుకోవాలి. ఇంజక్షన్లు చేసుకోవాలి సరేనా! ” అని ఇమ్రాన్ గొంతు మార్చి కొడుకుతో మాట్లాడాడు. ఫలించింది. ఆ.. ప్రయత్నమూ ఫలించింది. ఔను! ఇవాళ అయన్ రియల్ హీరో.. బట్ ఇమ్రాన్ రీల్ హీరో .. ఎంత తేడా.. గెలవడం ప్రధానం. ఏ పరిస్థితీ నయం కాని వ్యాధిలాంటిది కాదనేది ఇందుకే! సవాళ్లు.. సమస్యలు.. కన్నీళ్లు.. వెన్నాడే నీడలు.. వెంటపడే కలలు.. పీడించే బాధలు..ఎన్నెన్ని ఉన్నా.. గెలవాలి. ఇప్పుడు ఇమ్రాన్ గెలిచాడు. అయాన్‌ని గెలిపించాడు. అందుకోసం తనకున్న చెడు అలవాట్లు వదులుకోవాలనుకున్నా డు. ముద్దు సన్నివేశాలలో నటించకూడదు అని నిర్ణయించుకున్నాడు.
ఏది గొప్ప? గెలవడమా? గెలిపించడమా? రెండూ గొప్పే! ఇందులో ఎక్కువ..తక్కువలకు తావే లేదు. ము..ద్దు.. అయాన్ కో ముద్దు.. చేదు గతాన్ని ముద్దాడి రేపటి వైపుగా పయనిస్తున్న ఇమ్రాన్ కి ఓ ముద్దు. కిస్ ఆఫ్ లైఫ్ .. ఇమ్రాన్ రాసిన పుస్తకమిది. వేదనకి అక్షర రూపమిది. కష్టం ఇంటి చుట్టమైనప్పుడు మీకు కూడా ఈ నెరేషన్ ఓ ఇన్సిప్రిరేషన్ కాక తప్పదు. చదివాక ఆ..అక్షరాలను ముద్దాడాక తప్పదు. అందరికీ మరోసారి నాన్నల దినోత్సవ శుభాకాంక్షలతో..
– రత్నకిశోర్ శంభుమహంతి