దేశంలో మత్తు పదార్థాల సరఫరా, వినియోగంపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడికక్కడ వీటి సరఫరా, వినియోగాన్ని కట్టడి చేస్తోంది. ఈ క్రమంలోనే కోల్‌కతా రేవులో భారీగా హెరాయిన్‌ని పట్టుకున్నారు ఉగ్రవాద నిరోధక దళం అధికారులు. తుక్కు సామగ్రితో కూడిన కంటైనర్ నుంచి దాదాపు రూ. 200 కోట్లు విలువ చేసే హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు కొన్ని రోజుల క్రితం సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు.
7.2 టన్నులకు పైగా లోహపు తుక్కు సామగ్రితో కూడిన ఈ కంటైనర్ దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్టు నుంచి ఫిబ్రవరిలో ఇక్కడకు వచ్చిందని, అందులో ఉన్న 12 గేర్ బాక్సులను తెరచి చూడగా 72 తెల్ల పొడి పాకెట్లు కనిపించినట్లు తెలిపారు. కంటైనర్‌లో మొత్తం 36 గేర్ బాక్సులు ఉండగా, అందులో 12 పెట్టెలపై తెల్ల రంగు గీతలు ఉన్నాయని, వాటిలోనే హెరాయిన్ పాకెట్లను దాచారని అధికారులు పేర్కొన్నారు.
ఏటీఎస్ అధికారులకు అందిన నిర్దిష్ట సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు. మిగిలిన గేర్ బాక్సులను కూడా తెరిచి సోదాలు నిర్వహిస్తామని తెలిపారు. కోల్‌కతా రేవు నుంచి మరో దేశానికి పంపించే ఉద్దేశంతో ఈ కంటైనర్‌ను ఇక్కడికి రప్పించినట్లు తేలిందన్నారు. రూ.198 కోట్ల విలువైన 39.5 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.