టీపీసీసీ చీఫ్ ఎంపికలో అనూహ్య నిర్ణయం అందుకేనా

-

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిపై అధిష్ఠానం కసరత్తు పూర్తైంది. గత కొన్నాళ్లుగా తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న అధ్యక్ష రేసుకు అధిష్ఠానం తెరదించబోతుంది. ఇక అనౌన్స్‌మెంట్ మాత్రమే మిగిలి ఉంది. పీసీసీ చీఫ్‌గా జీవన్‌ రెడ్డి… ప్రచారకమిటీ సారథిగా రేవంత్‌ రెడ్డి పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలనే అధిష్ఠానం జీవన్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సమాచారం. అధిష్టానం అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఏం జరింగిందన్నది ఆసక్తికరంగా మారింది.

పీసీసీ చీఫ్‌ ఎవరనే దానిపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు పూర్తి చేసింది. అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ విషయంలో నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించాలని సోనియాగాంధీ నిర్ణయించినట్లు సమాచారం. పార్టీలో అందరికి ఆమోదయోగ్యంగా ఉండే నిర్ఱయన్ని తీసుకోవాలని భావించిన ఏఐసీసీ.. వారం క్రితమే జీవన్‌రెడ్డిని ఢిల్లీకి పిలిచి మాట్లాడింది. ఆ తర్వాత గ్రౌండ్ ప్రిపేర్ చేసిన అధిష్ఠానం..దీనిపై తుదినిర్ణయం తీసుకుంది. సీనియర్ ఖాతాలో పీసీసీ చీఫ్ ఇచ్చినా చేయటానికి సిద్ధంగా ఉండాలని జీవన్‌ రెడ్డికి ఠాగూర్ సూచించినట్లు సమాచారం. సోమవారం రాత్రి రాష్ట్రవ్యవహరాల ఇంచార్జ్ ఠాగూర్ సమావేశమైన సోనియా గాంధీతో పీసీసీ నియామక ప్రక్రియను పూర్తిచేశారు.

పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా రేవంత్ రెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆఖరి నిమిషంవరకు పీసీసీ రేసులో ఉన్న రేవంత్‌ కు ప్రచారకమిటీ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ రెడ్డి పేరును వ్యతిరేకించడం.. రాహుల్,సోనియా గాంధీలకు లేఖలు కూడా రాయటంతో కొంత ఒత్తిడి పనిచేసింది. దీంతో రేవంత్‌కు ప్రచార కమిటీ ఛైర్మన్ పదవినే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఏ పదవి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని.. ప్రచార కమిటీ ఛైర్మన్ పనే తనకు ఇష్టం అంటున్నారు రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే సీనియర్లతో తలనొప్పులు వచ్చేలా ఉన్నాయనే భావనతోనే అధిష్ఠానం జీవన్ రెడ్డి వైపు మొగ్గినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. రాష్ట్రంలో తలనొప్పులు తెచ్చుకోవడం కంటే.. అలజడి లేకుండా జాగ్రత్త పడటమే బెటర్ అని అధిష్ఠానం భావించింది. రేవంత్‌ను వ్యతిరేకించిన సీనియర్లు.. జీవన్‌రెడ్డి విషయంలో సానుకూలంగా ఉండటంతో.. సోనియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డికి పీసీసీ అధ్యక్షపదవి ఇస్తే ఆయన చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరిని కలుపుకొని పోతారని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది.

జీవన్‌రెడ్డికి పార్టీ వ్యవహారాలు చక్కదిద్దే పనిలో ఉంటే, రేవంత్ రాష్ట్రమంతా తిరిగి పార్టీని బలోపేతం చేస్తారని అధిష్ఠానం భావిస్తోంది. ఇద్దరు కలిసి పనిచేస్తారనే ఆలోచనలో అధిష్ఠానం ఉంది. వీరిద్దరిపై ఈరోజు అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news