ఆంధ్రప్రదేశ్‌లో చింతామణి నాటక ప్రదర్శనపై వైశ్య సామాజికవర్గం నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రదర్శిస్తున్న ఈ నాటకంపై వైశ్యుల అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. చింతామణి నాటకం నిషేధంపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీనిపై తదుపరి విచారణ చేపడతామని హైకోర్టు ప్రకటించింది. రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌లో ఆయన తరఫున న్యాయవాది ఉమేష్ వాదన వినిపించారు. చింతామణి నాటకాన్ని నిషేధించడం వాక్ స్వాతంత్రాన్ని కోల్పోవడమేనని తెలిపారు. ఈ నాటకాన్ని నిషేధించడంతో పలువురు తమ జీవనోపాధిని కోల్పోయారని వెల్లడించారు. కాగా, నాటకానికి సంబంధించిన అసలు పుస్తకాన్ని హైకోర్టుకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 17వ తేదీకి వాయిదా వేసింది.