ఓవైపు హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. మరోవైపు వికీపీడియా ఆరోపణలు.. ఇంకోవైపు స్టాక్ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు.. వెరసి అదానీ సంపద రోజురోజుకు ఆవిరైపోతోంది. తాజాగా అదానీ కంపెనీల షేర్ల అమ్మకాలు ఊపందుకుని ఒక్కరోజే కంపెనీల మార్కెట్ విలువ 51,294 కోట్ల వరకు ఆవిరైనట్లు అంచనా. అదానీ ఎంటర్‌ప్రైజెస్ అత్యధికంగా 10.4 శాతం నష్టపోయింది.
హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలైన తర్వాత జనవరి 25 నుంచి షేర్ల పతనం ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ.11 లక్షల కోట్లకు పైగా కరిగిపోయింది. దాదాపు నెల వ్యవధిలో 60 శాతానికి పైగా విలువ ఆవిరైనట్లు అంచనా.
మరోవైపు ముంద్రాలో ఏర్పాటు చేయాలనుకున్న భారీ ప్లాంట్ నిర్మాణ ప్రణాళికలను పునఃసమీక్షించనున్నట్లు అదానీ గ్రూప్ సీఎఫ్‌ఓ జుగేశిందర్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం గ్రూప్ కంపెనీలు ఎదుర్కొంటున్న ఒడుదొడుకుల నేపథ్యంలో కొత్త ప్రాజెక్టులనూ చేపట్టబోమని ప్రకటించారు. కొత్త రోడ్డు ప్రాజెక్టులకు కూడా బిడ్లు దాఖలు చేయబోదని జుగేశిందర్ సింగ్ తెలిపారు.