ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. 11 మంది చిన్నారులు మృతి..!!

ఓ ఆస్పత్రిలో జరిగిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అగ్ని ప్రమాదంలో ఏకంగా 11 మంది నవజాత శిశువులు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఆఫ్రికన్ దేశమైన సెనెగల్‌లో చోటు చేసుకుంది. 11 మంది చిన్నారులు అగ్నిప్రమాదంలో చనిపోవడంతో ఈ వార్త దేశవ్యాప్తంగా అందరినీ కలచివేస్తోంది.

అగ్ని ప్రమాదం-చిన్నారులు
అగ్ని ప్రమాదం-చిన్నారులు

పూర్తి వివరాల ప్రకారం.. సెనెగల్‌లోని టివయూనే పట్టణంలో ఉన్న మేమ్ అబ్దు అజీజ్ సై దబాఖ్ ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు భారీగా చెలరేగాయి. అప్పటికే పిల్లల వార్డులో 14 మంది చిన్నారులు ఉన్నారు. మంటలు భారీగా చెలరేగటం వల్ల 11 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. మంటలు చెలరేగటం చూసి డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బంది అతి కష్టం మీద ముగ్గురు చిన్నారుల ప్రాణాలు కాపాడారు.

ఈ ఘటనపై విని దేశ అధ్యక్షుడు మ్యాకీ సాల్ ట్విట్టర్‌లో స్పందించారు. 11 మంది చిన్నారులు ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర దిగ్భాంతికి లోనయ్యారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే దేశంలో మూడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు. అయితే, గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. సెనెగల్‌లోని గడేదాడి లింగూరీలోని ఓ ఆస్పత్రిలో కూడా అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.