పెద్ద‌ల స‌భ : కేసీఆర్ ఇలాకాలో మ‌రో పోరు ? ఈ సారి ఎవ‌రి వంతంటే ?

-

అతని పేరు చిన్న మాసయ్య. ఊరు : పాలమూరు జిల్లా, హన్వాడ మండ‌ల వాసి. అత‌నొక భూ నిర్వాసితుడు. ద‌ళిత రైతు. గ‌తంలో ఎన్నో సార్లు త‌న గొంతుక వినిపించాడు. క‌రువు జిల్లా పాల‌మూరులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పేరుతో ద‌ళితుల భూములు గుంజుకోవ‌డంపై నిర‌స‌న వ్య‌క్తంచేస్తూ ఓ అధికార పార్టీకి చెందిన మంత్రి వ్య‌తిరేకంగా అసెంబ్లీ వాకిట కు చేరుకుని ఇవాళ త‌న గొంతుక వినిపించారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీచేసేందుకు సిద్ధ‌మై ఇవాళ నామినేష‌న్ కూడా వేశాడు. పాల‌మూరు జిల్లాలో ఓ మంత్రి ఆగ‌డాల‌కు సంబంధించి ఎప్ప‌టి నుంచో విప‌క్షం పోరాటం చేస్తోంది. తాజాగా ద‌ళిత రైతు పోరాటానికి బీజేపీ కూడా నేరు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. వ‌చ్చే జూన్ లో రాజ్య స‌భ ఎన్నిక‌ల్లో గెల‌వ‌క‌పోయినా ప‌ర్లేదు కానే తాను ఇక్క‌డి ప్ర‌జ‌ల హ‌క్కుల గురించి మాట్లాడ‌తాన‌ని అంటున్నారాయ‌న.

ఈ నేప‌థ్యంలో ఈ వివాదం ఎక్క‌డివర‌కూ పోనుంది ? ఇక‌! ఇదే స‌మ‌యంలో మంత్రి హ‌త్యకు ప్ర‌య‌త్నించార‌ని అభియోగాలు ఎదుర్కొంటున్న కొంద‌రు యువ‌కులు కూడా ఇవాళ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ప్ర‌స్తుతం వీరంతా జైలు నుంచి బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. వీరు కూడా టీఆర్ఎస్ పై పోరుబాట సాగిస్తున్నారు. గ‌తంలో ఇక్క‌డి ఎంపీగా పోటీచేసి గెలిచే క్ర‌మంలో అధికార పార్టీ కి చెందిన మ‌న్నె శ్రీ‌నివాస్ రెడ్డికి కానీ అదే స‌మ‌యంలో ఇక్క‌డ ఎమ్మెల్యే గా పోటీ చేసిన శ్రీ‌నివాస్ గౌడ్ (మ‌హ‌బూబ్ న‌గ‌ర్) గెలుపున‌కు కృషి చేసిన యువ‌కుల‌కే అధికార పార్టీ వ‌ర్గాలు చుక్క‌లు చూపిస్తుండ‌డంతో త‌ప్ప‌క వీళ్లంతా పోరుబాట బ‌ట్టి నామినేష‌న్లు వేశారు. ఇంకొంద‌రు కూడా ఇదే బ‌రిలో ఉండ‌నున్నారు. అయితే నామినేష‌న్  వేసే ప్ర‌క్రియకు సంబంధించిన గ‌డువు మే 31 వ‌ర‌కూ ఉంది. ఉప‌సంహ‌క‌ర‌ణ‌కు గ‌డువు జూన్ 03 వ‌ర‌కూ ఉంది. కానీ తాము ఎవ‌రు చెప్పినా అదిరేది లేదు బెదిరేది లేద‌ని స్ప‌ష్టంగా చెబుతున్నారు.

వాస్త‌వానికి ఎప్ప‌టి నుంచో పాల‌క ప‌క్షం ఆగ‌డాల‌ను ప్ర‌శ్నించేందుకు సోష‌ల్ మీడియా వేదిక‌గా చాలా మంది ప‌నిచేస్తున్నారు. ఆ విధంగా కేసీఆర్ ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పిదాలు అనేకం వెలుగులోకి వ‌చ్చాయి. రాజ్య స‌భ ఎన్నిక‌లే ల‌క్ష్యంగా ఎందుకంటే ఇక్క‌డి ప్రాంతంలో జ‌రుగుతున్న భూ అక్ర‌మాల  కార‌ణంగా ద‌ళితులు అన్యాయం గా బ‌లి అయిపోతున్నార‌న్న‌ది  నిర‌స‌న‌కారుల ఆవేద‌న. పైకి తాము ద‌ళిత బంధు ప‌థ‌కం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్నాం అని కేసీఆర్ చెప్పినా కూడా, స్థానిక నాయ‌క‌త్వాలు అందుకు భిన్నంగా వ్య‌వ‌హరిస్తున్నాయి.

గ‌తంలో ప‌సుపు బోర్డు సాధ‌న  కోసం పెద్ద  ఎత్తున రైతులు పోరాటం చేశారు. అదేవిధంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో నిజామాబాద్ కేంద్రంగా పోటీ చేసి, ఆ రోజు కేసీఆర్ గారాల‌ప‌ట్టి కవిత‌క్క‌ను ఓడించారు. నామినేష‌న్లు ఉప సంహ‌రించుకోమ‌న్నా ప‌ట్టిన ప‌ట్టు విడువకుండా ఆ రోజు రైతులు త‌మ మాట నెగ్గించుకున్నారు.ఆ రోజు ఫ‌లితాల్లో బీజేపీ త‌ర‌ఫున అర‌వింద్ గెలిచిన‌ప్ప‌టికీ పోరుబాట‌లో త‌మ మాట నెగ్గించుకుని నైతిక విజ‌యం సాధించింది రైతులే ! నాటి  ఉద్య‌మ స్ఫూర్తితోనే రెండు స్థానాలు మాత్ర‌మే రాజ్య స‌భ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కు ద‌క్కే అవ‌కాశం ఉన్నా కూడా.. పాల‌క ప‌క్షంపై ఆ రైతు తిరుగుబాటు చేయ‌నుండ‌డం విశేషం. ఓ విధంగా శుభ‌పరిణామం అంటున్నాయి విప‌క్ష పార్టీలు.

Read more RELATED
Recommended to you

Latest news