కృష్ణా జిల్లా గన్నవరం రాజకీయాలు గత మూడు నెలలుగా గరం గరంగా ఉన్నాయి. టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీమోహన్ జగన్ చెంత చేరిపోయారు. ఆయన అధికారికంగా వైసీపీలో చేరకపోయినా ఆ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. గన్నవరం నుంచి వంశీ వరుసగా రెండుసార్లు గెలిచారు. రెండోసారి మొన్న ఎన్నికల్లో గెలిచిన కొద్ది నెలలుకే ఆయన పార్టీకి దూరం అవ్వడంతో పాటు చంద్రబాబు, లోకేష్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. ఇక వంశీ వైసీపీ ఇన్‌చార్జ్‌ను కూడా తానేనని ప్రకటించుకున్నారు. అయితే గన్నవరంలో పాత వైసీపీ నేతలు అందరూ కూడా వంశీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
గన్నవరంలో ఉప ఎన్నిక వస్తే తాను పోటీ చేస్తానని 2014లో వంశీపై పోటీ చేసి ఓడిన దుట్టా రామచంద్రరావు వంశీకి సవాల్ విసురుతున్నారు. వంశీ మాత్రం ఉప ఎన్నికలకు వెళతానని ముందు హడావిడి చేసినా తర్వాత సైలెంట్ అయ్యారు. ఇక తాజాగా గన్నవరంలో పరిస్థితి ఎలా ఉంటుంది అనేదానిపై ఓ ప్రైవేటు సర్వే జరిగింది. ఈ క్రమంలోనే వంశీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లినా తాము టీడీపీకే ఓట్లు వేస్తామని ఈ సర్వేలో ఏకంగా 54 శాతం మంది చెప్పారట.
ఏపీలో టీడీపీ చిత్తుగా ఓడినా గన్నవరం టీడీపీ శ్రేణులు కష్టపడి మరీ వంశీని రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించాయి. గత ఎన్నికల్లో వంశీకి 800 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచారు. పార్టీ గాలి ఉన్నప్పుడు 2014లో కూడా వంశీకి 9 వేల మెజార్టీ మాత్రమే వచ్చింది. వంశీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు, కేడర్‌ను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వంశీపై ఓడిన వైసీపీ నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వర్గం అంతా వంశీ అంటేనే మండిపడుతున్నారు. ఇప్పుడు వంశీకి వైసీపీ టిక్కెట్ ఇస్తే తాము సహకరించమని కూడా తెగేసి చెపుతోన్న పరిస్థితి.
ఇక తాజా సర్వేలో అటు టీడీపీ వాళ్లు సైతం తాము వంశీకి ఓట్లేయమని.. టీడీపీకే వేస్తామని చెపుతుండడాన్ని బట్టి చూస్తే గన్నవరంలో వంశీ జంపింగ్‌లు నియోజకవర్గ జనాలకు, అన్ని పార్టీల వాళ్లకు నచ్చడం లేదని తెలుస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో వంశీ తన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళతాడని ఆశించడం అత్యాశే అవుతోంది.
-Vuyyuru Subhash