జిల్లా కలెక్టర్​ బాధ్యతల్ని భర్తకు అప్పగించిన భార్య!

-

‘నేను వెళ్తున్నాను. ఇక నుంచి ఈ జిల్లా బాధ్యతలు మీరే చూసుకోండి.’ అని ఓ జిల్లా కలెక్టర్ తన భర్తకు బాధ్యతలను అప్పగించి వెళ్లిపోయారు. సాధారణంగా సర్పంచ్, ఎంపీటీసీ వంటి పదవుల్లో భార్యలు గెలిస్తే పెత్తనం భర్తలు చేయడం చూస్తుంటాం. ఇది కూడా అలాంటి సంఘటనే అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. అసలు సంగతేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి మరి..
కేరళలోని అలప్పుళ జిల్లా కలెక్టరేట్ మంగళవారం ఓ అరుదైన సంఘటనకు వేదికైంది. జిల్లా కలెక్టర్​ బాధ్యతల్ని భర్తకు అప్పగించి వెళ్లిపోయారు భార్య. అదే సమయంలో కాంగ్రెస్​ నేతృత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్​ కూటమికి చెందిన కార్యకర్తలు.. కలెక్టరేట్​ బయట తీవ్రస్థాయిలో నిరసనలు చేపట్టారు. ఈ అధికార బదిలీని వ్యతిరేకించారు.
ఇదంతా ఎందుకంటే.. రేణు రాజ్.. ఇప్పటివరకు అలెప్పీ కలెక్టర్​ గా పనిచేశారు. ఇటీవలే ఆమెను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో శ్రీరామ్​ వెంకట్రామన్​ను నియమించింది. రేణు, శ్రీరామ్.. భార్యాభర్తలు కావడం విశేషం. వృత్తిరీత్యా వైద్యులైన వారిద్దరూ తర్వాత ఐఏఎస్​లుగా మారారు. ఈ ఏడాది ఏప్రిల్​లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పటివరకు కేరళ ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు శ్రీరామ్. మంగళవారం భార్య రేణు నుంచి అలప్పుళ జిల్లా కలెక్టర్​గా బాధ్యతలు చేపట్టారు.
నిరసనల స్వాగతం.. ఇంతటి అరుదైన సన్నివేశానికి వేదికైన అలెప్పీ కలెక్టరేట్.. అదే సమయంలో నిరసనలతో హోరెత్తింది. శ్రీరామ్​కు కలెక్టర్​ బాధ్యతలు అప్పగించడాన్ని తప్పుబడుతూ యూడీఎఫ్​ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. గతంలో శ్రీరామ్ వెంకట్రామన్​పై నమోదైన కేసే ఇందుకు కారణం.
2019లో శ్రీరామ్.. తన స్నేహితురాలు వఫా ఫిరోజ్​తో కలిసి కారులో వేగంగా వెళ్తూ.. ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు. ఆ బైక్​పై ప్రయాణిస్తున్న జర్నలిస్ట్ మృతిచెందారు. ఈ కేసులో బెయిల్​ పొంది, విచారణ ఎదుర్కొంటున్న శ్రీరామ్​ను కేరళ ప్రభుత్వం 2020లో తిరిగి విధుల్లోకి తీసుకుంది. అయితే.. ఇప్పుడు కలెక్టర్​ పోస్టు ఇవ్వడంపై కాంగ్రెస్​ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. “జిల్లా కలెక్టర్​ అంటే జిల్లా మెజిస్ట్రేట్. ‘నిందితుడు’ అయిన వ్యక్తి ప్రజలకు ఎలా న్యాయం చేయగలరు?” అనేది కాంగ్రెస్​ వాదన.

Read more RELATED
Recommended to you

Latest news