ఘట్టం ఏదైనా, పాత్ర ఏదైనా ఆయన ప్రవేశిస్తే సంచలనం… భాష ఏదైనా, హీరో ఎవరైనా ఆయన గొంతు సాయం చేస్తే ఆ పాత్ర చిరస్థాయి జ్ఞాపకం… ఆయన కనపడని నాలుగో సింహం అయినా, కనిపించే మూడు సింహాల కన్నా పవర్ ఎక్కువ.. పౌరుషం ఎక్కువ… అంతేకాదు, వెండితెరపై అతని నటనను చూసి, వావ్.. అన్న గుండెలు ఎన్నో… బుల్లితెరపై అతని ప్రదర్శన చూసి, మనోడు అనుకున్న మనసులు ఇంకెన్నో… ఆయనే డైలాగ్ కింగ్ సాయికుమార్. “చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కనిపించే మూడు సింహాలు ప్రతీకలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్” ఈ డైలాగ్ వినగానే ఆయనే మన కళ్లముందు మెదులుతూ ఉంటారు. రజనీకాంత్, సుమన్, రాజశేఖర్ వంటి అగ్రనటులకు తన గొంతును అరువిచ్చి వారి సక్సెస్‌లో భాగమయ్యారు. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించారు. ప్రస్తుతం అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ ఉన్నారు. ఈరోజు సాయి కుమార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన గురించి సాయి చెప్పుకున్న ఆసక్తికర విషయాలను నెమరువేసుకుందాం…
‘పోలీస్‌స్టోరీ’ అవకాశం అలా వచ్చింది.. ‘లాకప్‌డెత్’ సినిమా చేస్తున్న సమయంలో థ్రిల్లర్ మంజుగారు పరిచయం అయ్యారు. కన్నడలో పోలీస్ సినిమాలంటే శంకర్‌నాగ్, ఆ తర్వాత దేవరాజ్‌లకు మంచి పేరుంది. దేవరాజ్‌తో చాలా సినిమాలు చేశా. ఈ కథ ఆయన చేయాల్సింది. కానీ కుదరలేదు. కథ విన్న తర్వాత నన్ను కూడా చేయమంటారేమో అనుకున్నా. కానీ, అడగలేదు. ఆ తర్వాత పెద్ద పెద్ద హీరోలను కూడా అనుకున్నారు. వాళ్లూ సెట్ కాలేదు. ‘ఎవరితో చేస్తారు మాస్టర్’ నేనే అని అడిగా. ‘ఇది వన్‌సైడ్ కథ. హీరోయిన్, పాటలు, రొమాంటిక్ సీన్లు ఉండవు. అందుకే కుమార్ గోవింద్‌ను అనుకుంటున్నాం’ అని చెప్పారు. ఆ తర్వాత దాని గురించి మర్చిపోయా.
ఇక నేను నా షూటింగ్ పనుల్లో బిజీ అయిపోయా. ‘సర్కిల్ ఇన్‌స్పెక్టర్’ క్లైమాక్స్‌లో నా పాత్ర చనిపోతుంది. సాధారణంగా షూటింగ్ చేసేటప్పుడు ఎవరైనా చనిపోయినట్లు సన్నివేశం తీస్తే, అంతా అయిపోయిన తర్వాత కెమెరాను చూసి నవ్వడం ఆనవాయితీగా వస్తోంది. నేను కూడా ఆ సీన్ అయిపోయిన తర్వాత కెమెరా వంక చూస్తూ నవ్వాను. సడెన్‌గా థ్రిల్లర్ మంజు మాస్టర్ నా దగ్గరకు వచ్చి, ‘పాత సాయి చచ్చిపోయాడు. అగ్నిగా కొత్తసాయి పుడతాడు. నీకో బ్యాడ్ న్యూస్ ‘పోలీస్‌స్టోరీ’లో నువ్వు హీరో’ అని చెప్పేసి వెళ్లిపోయారు. ఆయన జోక్ చేశారేమో అనుకున్నా. మరుసటి రోజు పిలిస్తే వెళ్లి కథ విన్నా.
ఫ్యామిలీ సూసైడ్ చేసుకునేవాళ్లం.. ‘ఈశ్వర్ అల్లా’ సమయంలో సురేఖ(భార్య) సపోర్ట్ చేయకపోతే మా ఫ్యామిలీ అంతా ఆత్మహత్య చేసుకునేవాళ్లం. ‘నేను సూసైడ్ చేసుకుంటా’ అని నాన్న ఫోన్‌లో నాతో అన్నారు కూడా. అప్పుడు నేను నా చెల్లెలు కమల ఇంట్లో ఉన్నా. నా దురదృష్టం ఏంటంటే.. ‘పోలీస్‌స్టోరీ’ మంచి విజయం సాధించిన తర్వాత నా ప్లానింగ్ మిస్సయింది. అప్పుడు సురేఖ లేకపోతే నాన్నను పోగొట్టుకునేవాడిని. అప్పట్లో ఇండస్ట్రీలో కొందరు నిర్మాతలు ప్రత్యక్షంగా, పరోక్షంగా తిట్టిన వాళ్లూ ఉన్నారు. ‘అనవసరంగా సినిమా తీశారు’ అంటూ మాట్లాడితే బాధగా ఉంటుంది కదా! దాన్ని అంత ఈజీగా తీసుకోలేం. ‘శర్మ కూడా సినిమా తీస్తే.. ఇలాగే ఉంటుంది’ అన్న మాటలు వినిపించాయి. ఆ రోజుల్లో రెండు కోట్ల ప్రాజెక్టు. మంచి పాటలు.. నటులు కూడా ఉన్నారు. అయితే, అందులో నాన్న విలన్‌గా చేయడం మేము వేసిన రాంగ్‌స్టెప్. ఎందుకంటే క్లైమాక్స్‌లో నేను నాన్నను కొడుతుంటే ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. తండ్రీ కొడుకులన్న ఫీల్ ఉంటుంది. బయ్యర్ల కోసం సినిమా వేశారు. ఎవ్వరికీ నచ్చలేదు. చాలా టెన్షన్ పడ్డాం. చాలామందికి డబ్బులు కట్టాలి. అప్పుడు నాన్న ఫోన్ చేసి, ‘ఇప్పటి వరకూ నా జీవితం ఒకటి. మీరంతా కలిసి నన్ను రోడ్డుమీదకు తీసుకొచ్చారు. కాబట్టి రేపు సినిమా విడుదల కాకపోతే నేను చచ్చిపోతా’ అన్నారు. నాకు కన్నీళ్లు ఆగలేదు. మా ఇద్దరి సంభాషణలో మరో గదిలో ఉన్న నా భార్య సురేఖ ఇంకో ఫోన్‌లో వింటూ ఉన్నది. ఆ మరుసటి రోజు పంచాయతీకి సురేఖ వచ్చింది. దాసరిగారు మాట్లాడుతూ.. ‘నీ భర్తలో మంచి టాలెంట్ ఉంది. రెండు కోట్లే కదా! రిస్క్ చేయండి. మరో మార్గం ద్వారా అవి వస్తాయి. అవసరమైతే సాయితో నేను సినిమా చేస్తా’ అని మాలో ధైర్యాన్ని నింపారు. ఆ రెండు కోట్ల అప్పులు తీర్చడానికి ఆరేడేళ్లు పట్టింది. ఆ తర్వాత నటించిన సినిమాలకు తీసుకున్న రెమ్యునరేషన్ తీసుకున్నట్టు అప్పులు కడుతూనే ఉన్నా.
నాన్నకు మందు బాటిల్ గిఫ్ట్‌గా.. ఒక పెద్ద స్టార్ సినిమా 100రోజులు ఆడింది. తిరుపతిలో ఫంక్షన్. నాన్న అందులో ఒక వేషం వేశారు. తనని కూడా రమ్మన్నారు. ఆయన నన్ను పిలిచి ‘నువ్వు కూడా రా’ అన్నారు. నేను రానని చెప్పా. ‘లేదు అందరం విమానంలో వెళ్తున్నాం. ఉదయాన్నే ఆఫీస్‌కు రమ్మన్నారు’ అని అన్నారు. ఆటోలో ఆఫీస్‌కు వెళ్తే అక్కడ ఎవరూ లేరు. సాంకేతిక నిపుణులు వెళ్లే బస్సు మాత్రమే ఉంది. ఏమైందని అడిగితే ‘ఉదయాన్నే అందరూ విమానంలో వెళ్లిపోయారు. మిమ్మల్ని బస్సులో రమ్మన్నారు’ అన్నారు. అంతే నాన్న అలిగారు. ఎలాగో ఆయన్ను బతిమాలి బస్సులో తీసుకెళ్లా. తీరా అక్కడకు వెళ్తే, భారీగా జనం రావడంతో ఫంక్షన్ అనుకున్నంత బాగా జరగలేదు. వెంటనే ముగించారు.
ఆ తర్వాత తిరుపతికి కొద్దిదూరంలో మూన్‌లైట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. వెళ్లేటప్పుడు ఎవరికీ విమానం లేదు. సూపర్ డీలక్స్ బస్సు పెట్టారు. అందరం డిన్నరకు వెళ్లాం. అయితే, మమ్మల్ని గేటు బయట ఆపేసి, ‘మీరు ఇక్కడకు రావొద్దు. ఉదయం వచ్చిన బస్సులో వెళ్లిపోండి’ అని ఒక స్టార్ ప్రొడ్యూసర్ అన్నాడు. నాన్నకు కన్నీళ్లు ఆగలేదు. ‘సర్.. నేను ఈ ఫంక్షన్‌కు అర్హుడిని కాదు. దయచేసి నాన్నను పంపండి. కావాలంటే నేను ఆ బస్సులో వెళ్లిపోతా’ అని చెప్పినా వినిపించుకోలేదు. బాధతోనే బస్సు ఎక్కిన నాన్నకు మరో షాకిచ్చారు. అన్నం పొట్లాం, మందు బాటిల్ ఇచ్చి, ‘పండగ చేసుకోండి’ అన్నారు. నాన్న కోపంతో ఆ మందు బాటిల్‌ను నేలకేసి కొట్టారు. ‘స్కాచ్ తాగడానికి నేను అర్హుడిని కాదనమాట’ అంటూ ఎంతో బాధపడ్డారు. అప్పుడే అనుకున్నా ఎప్పటికైనా నాన్నకు స్కాచ్ కొనివ్వాలని. అమెరికా వెళ్లినప్పుడు అప్పట్లో 100 డాలర్ల పెట్టి ‘బ్లూలేబుల్’ స్కాచ్ కొన్నా. ఇది చూసిన గుమ్మడిగారు ‘భలే కొడుకువయ్యా’ అన్నారు!
ఇంకొన్ని విషయాలు..
- విలక్షణ నటనకు మారుపేరు డైలాగ్ కింగ్ సాయి కుమార్. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి తన నటన ప్రతిభతో కన్నడలో స్టార్ హీరోగా ఎదిగారు. సాయి కుమార్ డైలాగులు చెప్పడం మొదలు పెడితే థియేటర్లు చప్పట్లు, విజిల్స్‌తో మారుమ్రోగి పోయేవి.
- స్టార్ హీరోల చిత్రాలకు తన గొంతుతో ప్రాణ ప్రతిష్ఠ చేసి కింగ్ ఆఫ్ వాయిస్‌గా ఫేమస్ అయ్యారు.
- డబ్బింగ్ ఆర్టిస్టుగానే కాకుండా…హీరోగా…విలన్‌గా..తండ్రిగా…క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో పాత్రలకు తన నటనతో జీవం పోశారు సాయికుమార్.
- 1960 జూలై 27న మద్రాసులో ప్రముఖ నటుడు పిజే శర్మ, కృష్ణ జ్యోతిలకు జన్మించారు. సాయి కుమార్ తండ్రి పి.జే.శర్మ మంచి నటుడే కాదు…డబ్బింగ్ ఆర్టిస్టు కూడా. తండ్రి డబ్బింగ్ కళాకారుడు కావడంతో సాయి కుమార్ బాల్యం నుంచే ఆ వృత్తిలో ప్రవేశించి మంచి డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు.
- డబ్బింగ్ కళాకారుడిగా సాయి కుమార్ తొలి చిత్రం ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించిన ‘సంసారం’. బాలనటుడిగా సాయి కుమార్ మొదటి సినిమా ‘దేవుడు చేసిన పెళ్లి’. ఆ తర్వాత తెలుగు, కన్నడ సినిమాల్లో కొన్ని రోల్స్ చేసారు. తెలుగులో నటుడిగా సాయికుమార్‌కు పేరు తెచ్చిన సినిమా ‘కలికాలం’. ఇక హీరోగా డైలాగ్ కింగ్‌కు పేరు తెచ్చిన మూవీ ‘పోలీస్ స్టోరీ’. పోలీస్ స్టోరీ తర్వాత సాయి కుమార్ కన్నడలో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. ఈ మూవీని తెలుగులో అదే పేరుతో డబ్ చేస్తే ఇక్కడ కూడా సూపర్ హిట్టైయింది. ఈ మూవీలో సాయి కుమార్ చెప్పిన డైలాగులు థియేటర్స్‌లో మారు మోగాయి.ఈ మూవీలో కనిపించే మూడు సింహాలు చట్టానికీ,న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే…కనిపించని ఆ నాల్గో సింహమేరా పోలీస్ అని చెప్పిన డైలాగ్.. ఇప్పటికీ ప్రేక్షకుల నోళ్లలో నానుతూనే ఉంది. అంతలా తన డైలాగులతో తెలుగు ప్రేక్షకుల మది దోచుకున్నారు.
- 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో దాదాపు వెయ్యికి పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు సాయికుమార్. తన గాత్రంతో యువ కళా వాచస్పతి అనే బిరుదును పొందారు. సామాన్యుడు సినిమాలోని నటనకుగాను ఉత్తమ ప్రతినాయకుడిగా నంది బహుమతి అందుకున్నారు. మరోవైపు ‘ప్రస్థానం’ మూవీలోని నటనకుగాను ఉత్తమ సహాయ నటుడిగా పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఓవైపు సినిమాల్లో నటిస్తూనే స్మాల్ స్క్రీన్ పై ఎన్నో కార్యక్రమాలతో సందడి చేస్తున్నారు.