తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న కౌంటింగ్ అదే రోజు ఫలితాలను విడుదల చేయనుంది. హుజూరాబాద్ తోపాటు ఏపీలోని బద్వేల్ నియోజకవర్గానికి కూడా ఇదే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగనున్నాయి. మాజీ మంత్రి, టీఆర్ఎస్ పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్న ఈటెల రాజేందర్ అవినీతి ఆరోపణలపై టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి మూడు నెలల క్రితం జూన్ లో రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. రాజీనామా అనంతరం బీజేపీలో చేరారు. పార్టీలో కీలక వ్యక్తి, మంత్రి రాజీనామా చేయడంతో రాష్ట్రం ద్రుష్టి హుజూరాబాద్ వైపు మళ్లింది. అందుకు అనుగుణంగానే టీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. రెండు పార్టీల ముఖ్యనాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరోనెల రోజుల్లో హుజూరా’బాదుషా‘ ఎవరో తెలియనుంది.
నోటిఫికేషన్ విడుదల- అక్టోబర్ 1
నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు- అక్టోబర్ 8
నామినేషన్ పరిశీలన – అక్టోబర్ 11
నామినేషన్ విత్ డ్రా తుదిగడువు – అక్టోబర్ 13
పోలింగ్- అక్టోబర్ 30
కౌంటింగ్, ఫలితాలు- నవంబర్ 2