అత్తారింటికి దారేది సినిమాలో ఒక సీన్‌లో ‘హీరో విలన్ కొట్టుకుంటూ మధ్యలో కమెడియన్‌ని చంపేసినట్లు ఉందని’ ఆహుతి ప్రసాద్ ఓ డైలాగ్ చెబుతారు… అయితే ఈ డైలాగ్ హుజూరాబాద్ ఉపఎన్నికలో కౌశిక్ రెడ్డికి బాగా సెట్ అయ్యేలా ఉంది. అసలు హుజూరాబాద్ పోరు ఏ స్థాయిలో జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ఎవరు బరిలో ఉన్నా సరే అసలు పోటీ కేసిఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగా జరుగుతుంది.
అయితే ఈ పోరులో ఎలాంటి ఫలితం వస్తుందో ఇప్పుడైతే క్లారిటీ రావడం లేదు. కానీ నవంబర్ 2న ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇక అప్పుడు టిఆర్‌ఎస్ గెలిస్తే…పరిస్తితులు వేరుగా ఉంటాయి…అలాగే ఈటల గెలిస్తే మరొకలా ఉంటాయి. కాకపోతే ఇక్కడ టిఆర్‌ఎస్ గెలుపోటములపై కౌశిక్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉందని చెప్పొచ్చు. మొన్నటివరకు కాంగ్రెస్‌లో హడావిడి చేసిన కౌశిక్…ఎప్పుడైతే ఈటల రాజీనామా చేశారో అప్పటినుంచే టిఆర్‌ఎస్‌తో అంతర్గతంతో సంబంధాలు నడుపుతూ వచ్చారు. ఆ విషయం బయటపడేసరికి టిఆర్‌ఎస్‌లోకి జంప్ కొట్టారు.
కానీ టిఆర్‌ఎస్‌లోకి వెళ్ళాక హుజూరాబాద్ టికెట్ దక్కలేదు. దీంతో టిఆర్‌ఎస్ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. అయితే కౌశిక్‌కు ఎమ్మెల్సీ ఇవ్వాలని కేసిఆర్ ఫిక్స్ అయ్యారు. కానీ కౌశిక్ ట్రాక్ రికార్డు చూసి గవర్నర్ ఎమ్మెల్సీ సీటుకు ఆమోదముద్ర వేయాలి. అయితే హుజూరాబాద్ ఉపఎన్నిక అయ్యాక….ఎమ్మెల్సీ సీటు విషయంలో క్లారిటీ వచ్చేలా ఉంది.
కాకపోతే టిఆర్‌ఎస్ గెలిస్తే…ఖచ్చితంగా కౌశిక్‌కు సీటు వస్తుందని చెప్పొచ్చు…కానీ ఓడిపోతే కౌశిక్ పరిస్తితి ఏంటో క్లారిటీ లేదు. పైగా కౌశిక్ రాజకీయ భవిష్యత్ కూడా ఇబ్బందుల్లో పడే అవకాశాలు లేకపోలేదు. అందుకే అనుకుంటా ఇప్పుడు టిఆర్‌ఎస్ తరుపున తెగ ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, ఈటల టార్గెట్‌గా ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు బాగానే విమర్శలు చేస్తున్న కౌశిక్ పరిస్తితి..టిఆర్‌ఎస్ ఓడిపోయాక ఎలా ఉంటుందో అర్ధం కాకుండా ఉంది. మొత్తానికి హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్‌ని చంపేసినట్లుగానే కౌశిక్ పరిస్తితి అయ్యేలా ఉంది.