ఈటల తప్పుకున్నట్టేనా : జమున ఆసక్తికరమైన వ్యాఖ్యలు

మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామాతో హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. దీంతో హుజూరాబాద్‌లో త్వరలోనే ఉపఎన్నిక జరగనుంది. ఈ ఉపఎన్నికపై అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ప్రచారం కొనసాగిస్తున్నాయి.

ముఖ్యంగా ఈ ఉప ఎన్నికల పోరులో బీజేపీ-టీఆర్ఎస్‌లు నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి. హుజూరాబాద్‌లో గెలుపు పై రెండు పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ప్రచారంలో ఈటెల జమున ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

పోటీలో నేను ఉన్నా.. రాజేందర్ ఉన్నా ఒక్కటే అని చెప్పిన ఈటెల జమున..ఎవరు పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. ఎవరికి అవకాశం వస్తే వారు పోటీ చేయాలన్న ఆలోచన ఉందని తెలిపారు. ఎవరు పోటీ చేసినా గుర్తు అదే ఉంటుందని స్పష్టం చేశారు. కాకపోతే మనుషులే మారొచ్చని తెలిపారు. ఇక ఈటెల జమున తాజా వ్యాఖ్యలు చూస్తుంటే.. ఈ ఉప ఎన్నికల్లో ఆమె బిజేపి అభ్యర్థి గా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.