హైదరాబాద్ నగర వాసులకు మెట్రో రైలు సంస్థ బ్యాడ్ న్యూస్ చెప్పింది. మరోసారి మెట్రో రాయితీల్లో కోత విధించడానికి రెడీ అయింది. ఇవాళ్టి నుంచి మెట్రో రాయితీల్లో కోత విధించనున్నట్లు అధికారులు తెలిపారు. రద్దీ వేళల్లో డిస్కౌంట్ను పూర్తిగా ఎత్తివేయనున్నట్లు మెట్రో అధికారులు పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకూ.. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ మాత్రమే రాయితీ వర్తిస్తుందని తెలిపారు.
సూపర్ సేవర్ హాలీడే కార్డ్ ఛార్జీని భారీగా పెంచనున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం సెలవు రోజుల్లో ప్రయాణించే హాలిడే కార్డు రూ.59గా ఉన్న ధరను రూ.99కి పెంచనున్నారు. గతంలో రూ.59లతో కార్డు తీసుకున్న వారు సూపర్ సేవర్ రూ.99 రీఛార్జ్ చేసుకోవచ్చని మెట్రో అధికారులు ప్రకటించారు.
కానీ, కొత్తగా తీసుకునే వారు మాత్రం రూ.100 చెల్లించాలని పేర్కొన్నారు. అలాగే కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డుల ధరను భారీగా పెంచనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైళ్లలో సగటున ప్రతి రోజూ 4.4 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. వీరందరిపై పైన పేర్కొన్న ధరల ప్రభావం ఉండబోతున్నాయి.