హైదరాబాద్ నగరంలో మళ్లీ భారీ వాన కురుస్తోంది. నగరంలోని మెహిదీపట్నం, గోషామహల్, మంగళ్‌హాట్, ఆసిఫ్‌నగర్, జియాగూడ పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, చంద్రాయణగుట్ట, సికింద్రాబాద్, ప్యాట్నీసెంటర్, బేగంపేట, అల్వాల్, చిలకలగూడ, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, మారేడుపల్లిలో ప్రాంతాల్లో వర్షం పడుతోంది.
ఏకధాటిగా కురిసిన వానతో నగరంలోని రహదారులన్ని జలమయమయ్యాయి. కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల నుంచి ఇంటికి తిరుగు పయనమైన వారంతా వానలో తడిసిముద్దయ్యారు. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద నీటి వల్ల పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసు అధికారులు ట్రాఫిక్ ను నియంత్రించారు.
మరోవైపు నాలాల నీటి వల్ల దోమలు ఎక్కువవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికే వైరల్, టైఫాయిడ్, డెంగీ జ్వరాలతో సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పొంగుతున్న నాలాల వల్ల మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామంటున్నారు. అధికారులు దీనికి శాశ్వత పరిష్కారం చూపి తమను రోగాల బారిన పడకుండా కాపాడాలని వేడుకుంటున్నారు.