హైదరాబాద్ యూటీ..అసద్ వ్యాఖ్యల వెనుక మతలబేంటి ?

Join Our Community
follow manalokam on social media

లోక్‌సభలో ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో కాక రేపుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్‌ను యూటీగా మార్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. భవిష్యత్‌లో ఇదే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌, బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. హైదరాబాద్ యూటీ పై లోక్ సభలో అసద్ ఎందుకు లేవనెత్తారు..దీని వెనకున్న ప్యూహం పై ఆసక్తికర చర్చ నడుస్తుంది.

కేంద్రపాలిత ప్రాంతం..అప్పుడెప్పుడో విభజన సమయంలో వినిపించిన మాట..కానీ రాజకీయంగా అప్పుడప్పుడు యూటీ కామెంట్స్‌ కలకలం రేపుతున్నాయ్‌..ఓ వైపు ఇంకో మూడేళ్లలో హైదరాబాద్‌ ఉమ్మడి కేపిటల్‌ నుంచి పూర్తిస్థాయి తెలంగాణ రాజధానిగా మారనుంది. ఈ సమయంలో హైదరాబాద్‌ను కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందని ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. జమ్మూకశ్మీర్‌ పునర్విభజన చట్ట సవరణ బిల్లుపై చర్చలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మోడీ సర్కార్‌ త్వరలో హైదరాబాద్‌ను తన గుప్పిట్లోకి తీసుకుంటుందని చెప్పారు. హైదరాబాద్‌ మాత్రమే కాదు.. చెన్నై, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్‌, లక్నో నగరాలను కూడా యూటీ చేస్తారని అన్నారు. ఇదే బీజేపీ మార్క్‌ పాలన అని అన్నారు. కశ్మీర్‌ విభజనే దీనికి ఉదాహారణ అంటున్నారు ఓవైసీ. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతాన్ని చేయాలనే ఆలోచనే లేదన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. అయితే బీజేపీ, ఎంఐఎం నేతలు కొత్త కుట్రకు తెరతీశారంటూ మండిపడుతున్నారు కాంగ్రెస్‌ నేతలు.

అసలు హైదరాబాద్‌ను యూటీ చేస్తారన్న ప్రచారమూ లేదు. ఆ దిశగా అడుగులు లేవు..కానీ అనూహ్యంగా యూటీ మాట తెరపైకి రావడం సంచలనంగా మారింది. అసలు ఓవైసీ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ నేతలు మాత్రం ఓవైసీపై భగ్గుమంటున్నారు. ఏ నగరాన్ని కేంద్ర ప్రభుత్వం యూటీ చేయబోదని.. అన్ని నగరాలను అభివృద్ధి చేసేది తమ ప్రభుత్వమేనని చెప్పారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. సభలో దీనిపై సమాధానం చెప్పే సమయంలోనే అసద్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారని అన్నారు.

మరోవైపు యూటీ మాటలపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. ఇది బీజేపీ, ఎంఐఎం ఆడుతున్న నాటకమని మండిపడ్డారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తారంటూ రెచ్చగొట్టడం కోసమే అసద్ ఈ వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ ప్యూహంలో భాగంగానే ఓవైసీ మాట్లాడరని కాంగ్రెస్ మండిపడుతుంది. మీడియాలో కనిపించేందుకే అసద్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌. హైదరాబాద్‌ లేని తెలంగాణ మనుగడ కష్టమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

హైదరాబాద్‌ను యూటీగా చేసే ప్రయత్నం కేంద్రం చేస్తే.. దానిని తెలంగాణ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుందంటున్నారు టీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్‌ తెలంగాణ గుండెకాయ అని.. దానిని మా నుంచి దూరం చేసే ఏ ప్రయత్నాన్ని సహించేది లేదన్నారు. మొత్తంగా అసద్‌ వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయ్‌. కొత్త చర్చను తెరమీదికి తీసుకొచ్చింది. అసలు ఏ ఉద్దేశంతో అసదుద్దీన్‌ ఈ వ్యాఖ్యలు చేశారనే దానిపై ఆయా పార్టీలు లెక్కలేసుకుంటున్నారు.

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....