స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించే బాధ్యత పూర్తిగా తాను తీసుకుంటానని ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్ తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మం పాలెం వద్ద చేపట్టిన దీక్ష 1223 రోజులకు చేరుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ దీక్షా శిబిరాన్ని ఇవాళ పల్లా శ్రీనివాసరావు యాదవ్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఈ దీక్ష శిబిరాన్ని సందర్శించానని ,స్టీల్ ప్లాంట్ కార్మికులు నిర్వాసితులు తనకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఎంతోమంది ప్రాణ త్యాగాలతో స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆర్థికంగా ప్లాంట్‌ను ఆదుకునే ప్రయత్నం చేస్తానని అన్నారు.రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చిన స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసితులు యువ నాయకుల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు.స్టీల్ ప్లాంట్ ఆదుకోవడం తప్పా తనకు ఏ పదవి ముఖ్యం కాదని ఉద్ఘాటించారు. తన మీద పూర్తిగా విశ్వాసం ఉంచాలని స్టీల్ ప్లాంట్ కాపాడుకునే బాధ్యత తనదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న మైన్స్‌ను స్టీల్ ప్లాంట్‌కు వచ్చేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.