నేడు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పర్యటించారు మంత్రి హరీష్ రావు. ఈ పర్యటనలో కోహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేశారు. అలాగే హుస్నాబాద్ సామాజిక ఆరోగ్య కేంద్ర పాత భవనం అభివృద్ధి, 50 పడకల ప్రభుత్వ మాతా శిశు వాసుపత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. అలాగే ఉచిత డయాలసిస్ కేంద్రం, రక్త శుద్ధికరణ కేంద్ర ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హుస్నాబాద్ ఆసుపత్రి ఇక 100 పడకల ఆసుపత్రిగా మారిందని, 2.85 లక్షలతో డయాలసిస్ ప్రారంభించుకున్నామన్నారు. అలాగే ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్ కోసం రెండు కోట్లు మంజూరు చేశామన్నారు. ఇక గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి అయితే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు మిగిలిన భూ సేకరణకు 23 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రాజకీయాల కోసం కాకుండా రైతుల కోసం ఆలోచించాలని, ప్రాజెక్టు పనులు అడ్డుకోవద్దని, అన్ని వర్గాలు సహకరించాలని కోరారు.