రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల,ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు విశేష సేవలు అందించారని, ఆయన వ్యక్తిత్వం అందరికీ స్ఫూర్తిదాయకమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్,బి.సి.సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా అన్నారు. రాజమహేంద్రవరం, కోటిలింగాల ఘాట్ చేరుకొని మేకపాటి గౌతమ్ రెడ్డి అస్తికలను నిమజ్జన కార్యక్రమాన్ని ఆయన కుమారుడు కృష్ణార్జున రెడ్డి నిర్వహించారు.తొలుత మేకపాటి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ..గౌతమ్ రెడ్డి హఠాన్మరణం దురదృష్టకరమని అన్నారు.రాష్ట్ర రాజకీయాలలో ఆయన ఒక చెరగని ముద్ర వేశారని చెప్పారు.మంత్రి చెల్లుబోయిన మాట్లాడుతూ..మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణ వార్త తననెంతో కలిచి వేసిందని ఆవేదన చెందారు.నిరంతరం పారిశ్రామికరంగంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే సంకల్పంతోనే పని చేసేవారని గుర్తు చేసుకున్నారు.సహచర మంత్రిగా ఆయనతో ఎంతో అవినాభావ సంబంధం ఉందంటూ నివాళులర్పించారు.కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భరత్ రామ్,రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రాజమహేంద్రవరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్, బొంతా శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.