ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగించాలి అంటూ అమరావతో ప్రాంత రైతులు గత 70 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్నాయి. ఒక్క వైసీపీ మినహా రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, వామపక్షాలు, సహా పలు పార్టీలు ఈ ఉద్యమానికి అండగా నిలుస్తూ వస్తున్నాయి. తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి సదరు పార్టీలు.
ఈ నేపధ్యంలో ఈ ఉద్యమానికి పక్క రాష్ట్రాల నాయకుల మద్దతు కూడా కూడగట్టే ఆలోచనలో అమరావతి ప్రాంత రైతులు ఉన్నారు. ఈ మేరకు రేపు అమరావతి పరిరక్షణ జెఎసి రౌండ్ టేబుల్ సమావేశానికి పిలుపు ఇచ్చింది. ఈ సమావేశంలో ఒక్క వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి గుంటూరు జిల్లా నేతలు, కృష్ణా జిల్లా ఎమ్మెల్యే ఒకరు పాల్గొంటారు.
వామపక్షాల నుంచి నారాయణ, రామకృష్ణ పాల్గొనే అవకాశం ఉంది. పలువురు మాజీ మంత్రులు కూడాఈ సమావేశానికి వస్తున్నారు. ఇక తెలంగాణా నుంచి కూడా పలువురు నేతలు హాజరవుతున్నారు. అమరావతి ఉద్యమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి, తెలంగాణా జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండ రాం సహా పలువురు హాజరవుతున్నారు. వాళ్ళు రేపు ఉదయం విజయవాడ రానున్నారు.
ఇక ఈ ఉద్యమం గత 70 రోజుల నుంచి రాజధాని గ్రామాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ వస్తుంది. అటు పోలీసులు కూడా ఈ ఉద్యమంలో కాస్త కఠినం గా వ్యవహరించడం విమర్శలకు వేదికగా మారింది. ఎక్కడిక్కడ ఉద్యమాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు. దీనితో ఉద్యమాన్ని తీవ్రతరం చెయ్యాలని అమరావతి జెఎసి భావిస్తుంది.