IND vs AUS: మొదటిరోజు టీమిండియా దూకుడు.. 5 వికెట్లతో జడేజా, 50 తో రోహిత్

-

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగపూర్ వేదికగా గురువారం ఆస్ట్రేలియా – టీమ్ ఇండియాల మధ్య ప్రారంభమైన తొలి టెస్ట్ లో మొదటిరోజు భారత్ సంపూర్ణ ఆదిపత్యం చెలాయించింది. తొలి రోజు నుంచే పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండడంతో భారత బౌలర్లు ఆసీస్ బ్యాటర్లను కంగారెత్తించారు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ ఆ జట్టుకు ఆదిలోనే దెబ్బ తగిలింది.

ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్ వెంట వెంటనే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత రెండవ సెషన్ లో రవీంద్ర జడేజా విజృంభించాడు. ఒకే ఓవర్ లో లబుషేన్, రెన్షా వికెట్లు తీసి ఆస్ట్రేలియాను దెబ్బతీశాడు. ఆ తర్వాత కీపర్ అలెక్స్ క్యారీ (36), హ్యాండ్స్ కాంబ్ (31) పరుగులు చేసి 50 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇక చివర్లో రవిచంద్రన్ అశ్విన్ కూడా మూడు వికెట్లతో చెలరేగడంతో ఆ జట్టు 177 పరుగులకు ఆల్ అవుట్ అయింది. మహమ్మద్ సిరాజ్, షమీ తలా ఓ వికెట్ పడగొట్టారు. రవీంద్ర జడేగా 22 ఓవర్లు వేసి 47 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు.

అనంతరం బ్యాటింగ్ కి దిగిన భారత జట్టుకి కెప్టెన్ రోహిత్ శర్మ మంచి శుభారంభాన్ని అందించాడు. కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ లోనే మూడు ఫోర్లు బాదాడు. దీంతో ఆసిస్ కాస్త ఒత్తిడికి లోనైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా బౌలర్లు ఎంత ప్రయత్నించినా వికెట్ తీయలేకపోయారు. 66 బంతుల్లోనే 50 పరుగులు సాధించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. కేఎల్ రాహుల్ 21 పరుగులతో శుభారంభం ఇచ్చారు.

అయితే మొదటి రోజు ఆట మరో ఎనిమిది బంతులలో ముగుస్తుంది అనగా ఓపెనర్ రాహుల్ మర్ఫి ఓవర్ లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దాంతో 76 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం రవిచంద్రన్ అశ్విన్ నైట్ వాచ్మెన్ గా క్రీజ్ లోకి వచ్చాడు. మొదటి రోజు ఆట ముగిసిన సమయానికి భారత జట్టు ఒక వికెట్ నష్టపోయి 77 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (56), అశ్విన్ (0) క్రీజ్ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news