రాష్ట్రంలో 15 రోజుల పాటు స్వాతంత్య్ర వేడుకలు

-

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా తెలంగాణలో 15 రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకల నిర్వహణపై ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయుల త్యాగాలు, పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా.. దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించాలని సీఎం నిర్ణయించారు. గడప గడపనా, వాడ వాడనా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని.. క్రీడా, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు, కవిసమ్మేళనాలు, జాతీయ భావాలు రగలించే సాంస్క్రతిక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఆగస్టు 15కు ముందు 7 రోజులు, తర్వాత 7 రోజులు.. మొత్తంగా 15 రోజుల పాటు రాష్ట్రంలో స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో, దేశ స్వాతంత్య్రం కోసం సాగిన పోరాటాలు, జరిగిన త్యాగాలు, నాటి జాతీయ నాయకులు, అమరుల వివరాలు నేటి తరానికి అర్థం కావాల్సి ఉందని కేసీఆర్ అన్నారు. పల్లె, పట్నం ఒక్కటై భారతావని ఘనకీర్తిని చాటాల్సి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.

రాష్ట్రంలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, పట్టణాల్లోని స్టార్ హోటల్లు సహా ప్రధాన కూడళ్లు, రహదారుల వెంట అనువైన చోటల్లా దేశభక్తి స్ఫూర్తి జాలువారేలా, జాతీయ జెండా రెపరెపలాడేలా చర్యలు చేపట్టాలని సీఎస్ సోమేశ్ కుమార్​ను ఆదేశించారు. ప్రజలు, ఉద్యోగుల నడుమ సత్సంబంధాలు పెంపొందించే ఫ్రెండ్లీ ప్రభుత్వ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్న సీఎం.. ఉద్యోగుల్లో కూడా దేశభక్తిని రగిలించే సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు.

మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఫ్రీడం రన్​లను నిర్వహించాలని సీఎస్​ను ఆదేశించారు. పంచాయతీరాజ్, పురపాలకశాఖల సారథ్యంలో పల్లె నుంచి పట్నం దాకా స్వాతంత్ర్య వజ్రోత్సవ దీప్తిని వెలిగించే దిశగా తగు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణ, దేశంలోని పలు ప్రాంతాలనుంచి, స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న నాటితరం జాతీయ నాయకుల వివరాలు విద్యాసంస్థల్లో విద్యార్థులు, యువతకు అర్థమయ్యేలా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version