భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు షాకిచ్చింది. మెయింటేనెన్స్, మౌలికవసతుల పనులను సాకుగా చూపుతూ మొత్తం 163 రైళ్లను క్యాన్సల్ చేసింది. ఇందులో 115 రైళ్లను పూర్తిగా రద్దుచేస్తున్నామని, మరో 48 సర్వీసులను పాక్షికంగా రద్దు చేస్తున్నామని ప్రకటించింది భారతీయ రైల్వే శాఖ. ఇది సోమవారం (అక్టోబర్ 10) ఒక్కరోజు మాత్రమేనని, తదుపరి సమాచారం అందిస్తామని భారతీయ రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ఈ రైళ్లకు సంబంధించి ముందుగానే బుక్‌చేసుకున్న టికెట్లను రద్దుచేస్తున్నామని ఐఆర్‌సీటీసీ (IRCTC) తెలిపింది. కౌంటర్లలో టికెట్లు కొనుగోలుచేసినవారు అధికారులను సంప్రదించాలని సూచించింది భారతీయ రైల్వే శాఖ. మరోవైపు ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపనున్నది. ఇందులో పలు సింగిల్ వే రైళ్లు కూడా ఉన్నాయి. సికింద్రాబాద్-యశ్వంపూర్ (07151) రైలు సోమవారం రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు గమ్య స్థానానికి చేరుకోనున్నది.
యశ్వంత్‌పూర్-సికింద్రాబాద్ (07152) రైలు మంగళవారం సాయంత్రం 5గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు గమ్యస్థానానికి చేరుతుంది. రెండు రైళ్లు కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తిరోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, యెహలంక స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అలాగే సోమవారం పూర్ణా-తిరుపతి మధ్య సింగిల్ వే స్పెషల్ ట్రైన్ (07633)ను నడుపనున్నట్లు చెప్పింది. రైలు రాత్రి 11.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.10 గంటలకు గమ్యస్థానానికి చేరనున్నది. అలాగే ఈ నెల 12న నర్సాపూర్-తిరుపతి, విజయవాడ-ధర్మవరం మధ్య సింగిల్ వే స్పెషల్ ట్రైన్స్‌ను నడుపనున్నట్లు పేర్కొంది. నర్సాపూర్-తిరుపతి (07130) రాత్రి 8.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 06.45 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందని, విజయవాడ-ధర్మవరం (07131) రాత్రి 11.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.