బర్మింగ్‌హామ్ వేదికగా అట్టహాసంగా కామన్వెల్త్ గేమ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. వివిధ విభాగాల్లో భారత ఆటగాళ్ల చరిత్రలు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కామన్వెల్త్ క్రీడల్లో పతకమే లక్ష్యంగా బరిలో దిగిన భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుతమైన విజయం సాధించింది. టోర్నీ ఆరంభంలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూసిన భారత జట్టు.. ఆ తర్వాత పట్టుదలగా ఆడుతూ వరుస విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా తొలి సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌తో తలపడి విజయం సాధించింది టీమిండియా. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయాలు నమోదు చేసిన ఇంగ్లండ్‌కు ఓటమి రుచిచూపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళలు.. స్మృతి మంధాన (32 బంతుల్లో 61), జెమీమా రోడ్రిగెజ్ (44 నాటౌట్) రాణించడంతో మంచి స్కోరు చేసింది. షెఫాలీ వర్మ (15) కొంత తడబడినా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20), దీప్తి శర్మ (20) మంచి సహకారం అందించారు. పూజా వస్త్రాకర్ (0) ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే రనౌట్ అయింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రేణుకా సింగ్, మేఘనా సింగ్, షెఫాలీ వర్మ మినహా భారత బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో భారీ షాట్లు ఆడటంలో విఫలమైన ఇంగ్లండ్ బ్యాటర్లు టార్గెట్ ఛేదించలేకపోయారు.
సోఫియా డంక్లీ (19), డాన్నీ వ్యాట్ (35) ఆ జట్టుకు శుభారంభమే అందించారు. అయితే భారత ఫీల్డర్లు అద్భుతమైన ప్రదర్శన చేయడంతో అలైస్ కాప్సీ (13), కెప్టెన్ నాట్ స్కివర్ (41), అమీ జోన్స్ (31) వరుసగా రనౌట్లు అయ్యారు. దీంతో ఆ జట్టు విజయావకాశాలు బాగా దెబ్బతిన్నాయి. కేథరీన్ బ్రంట్ (0)ను స్నేహ్ రాణా అవుట్ చేయగా.. మైయా బొషీర్ (4 నాటౌట్), సోఫీ ఎక్సెల్‌టోన్ (7 నాటౌట్) క్రీజులో ఉన్నా ఏం చెయ్యలేకపోయారు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చెయ్యగలిగింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లతో సత్తాచాటగా.. దీప్తి శర్మ ఒక వికెట్ తీసుకుంది. ఈ విజయంతో భారత మహిళలు కామన్ వెల్త్ క్రీడల్లో ఫైనల్ చేరుకున్నారు. మరికాసేపట్లో ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ జట్ల మధ్య రెండో సెమీస్ జరగనుంది. ఈ మ్యాచ్ విజేతతో స్వర్ణ పతకం కోసం భారత్ తలపడుతుంది.