అభ్యర్ది లేకుండా తిరుపతిలో బీజేపీ ప్రచారం పై ఆసక్తికర చర్చ

-

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ రావడంతోనే నామినేషన్ల సందడి మొదలైంది. ప్రధాన పార్టీలు అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. వారంతా ఎన్నికల వ్యూహంలో మునిగిపోయారు. ఎప్పటి నుంచో పోటీకి సై అంటున్న బీజేపీ మాత్రం తమ అభ్యర్థి ఎవరో తేల్చడం లేదు. ఐదు నెలలుగా విస్తృత స్థాయిలో రాష్ట్ర నేతలు కసరత్తు చేసినా అభ్యర్దిని మాత్రం తేల్చలేకపోయారు. దీని పై బీజేపీ నేతల్లోనే ఆసక్తికర చర్చ నడుస్తుంది.

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో బీజేపీ పోటీ ఓ ప్రహాసనంలా మారింది. నోటిఫికేషన్ వచ్చాక కూడా అభ్యర్థి ఎవరో తేలడం లేదు. క్యాండిడేట్‌ ఎవరో తెలియకుండానే ప్రచారం మొదలు పెట్టేశారు. బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి ఢిల్లీ నుంచే ప్రకటన వస్తుందని నేతలు సర్దిచెబుతున్నా కేడర్ లో మాత్రం అసంతృప్తి వ్యక్తమవుతోందట. దాదాపు అరడజను మంది పేర్లను సీరియస్‌గా పరిశీలించిన బీజేపీ నేతలు ఆ తర్వాత సైలెంటయ్యారు. బరిలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులే ఉంటాన్నది పార్టీ వర్గాల మాట.

కర్నాటకలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన రత్నప్రభ పేరు మళ్లీ ప్రముఖంగా తెరపైకి వస్తోంది. ఆమె కంటే ముందు మరో రిటైర్డ్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు పేరును పరిశీలించారు. ఈ ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా అభ్యర్థిగా ఉంటారని బీజేపీ నేతల మాటగా ఉంది. అయితే చివరి నిముషంలో డిల్లీ పెద్దలు ఏదైనా షాక్ ఇస్తారా అన్న సందేహాలు రాష్ట్ర పార్టీ నేతలకు లేకపోలేదు. కాకపోతే.. నామినేషన్లు మొదలైన తరువాత కూడా అభ్యర్థి ఎవరో చెప్పలేకపోవడం వల్ల పోటీ పై కేడర్ లో సీరియస్ నెస్ తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారట.

తిరుపతిలో అభ్యర్థిని గెలిపిస్తే.. కేంద్రమంత్రి అవుతారని బీజేపీ నేతలు ఎంత గొప్పగా ప్రచారం చేసినా అభ్యర్థి ప్రకటనపై కొనసాగుతున్న జాప్యం పార్టీ శ్రేణులకు అంతుచిక్కడం లేదు. తక్కువ సమయంలో అభ్యర్థిని నియోజకవర్గానికి పరిచయం చేసినా ఆశించిన ఫలితం ఉండదని సొంత పార్టీనేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news