రైతు చట్టాలను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనకు ప్లాన్ వేశారు ఆ ముగ్గురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు. ఎప్పుడు తెల్లావారుతుందా.. ఎప్పుడెప్పుడు వెళ్లి శిబిరంలో కూర్చుందామా అని ఎదురు చూశారు. కానీ ఉన్నఫలంగా కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించి శిబిరాన్ని పీకేశారు. ఇది ఇప్పుడు వరంగల్ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులు నష్టపోతారని చెబుతూ వరంగల్‌లో నిరసన తెలియజేసేందుకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి నిర్ణయించారు. దేవాదుల, కాళేశ్వర ప్రాజెక్టుల నీటిని రైతులు వినియోగించకుండా కేంద్రం అడ్డుకుంటోందన్న ఆరోపణపైనా కలెక్టరేట్ దగ్గర అన్నదాతలతో కలిసి ధర్నాకు ప్రణాళిక వేసుకున్నారు. ఈ నిరసన కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడుతున్నట్టు మీడియా సమావేశంలో గొప్పగా ప్రకటించారు ఎమ్మెల్యేలు. ఏర్పాట్లపైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు నాయకులు. అంతా బాగానే ఉన్నా.. నిరసన కార్యక్రమం ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు ఎలాంటి ఆందోళన లేదని ఎక్కడి వారు అక్కడ గప్‌చుప్ అయ్యారు.
దేవాదుల ఫేజ్-3, కాళేశ్వరం 3 టీఎంసీ ఎత్తిపోతలు, రామప్ప-పాకాల, మిషన్ భగీరథ, తుపాకులగూడెం సమ్మక్క-సారలమ్మ బ్యారేజ్ నిర్మాణ పనులను నిలిపివేయాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 29న ఒకరోజు నిరసనకు పిలుపిచ్చారు ఎమ్మెల్యేలు. కేంద్రం తీసుకున్న నిర్ణయంవల్ల వరంగల్ జిల్లాకు తీరని నష్టం జరుగుతుందనే అంశాన్ని హైలైట్ చేద్దామనుకున్నారు. బీజేపీపై యుద్ధాన్ని తలపించేలా ఫ్లెక్సీలు, పోస్టర్లతో వరంగల్ నగరాన్ని నింపేశారు. ఇంత హడావిడి చేసిన నాయకులు ఎందుకు వెనక్కి తగ్గారన్నదే ఇప్పుడు చర్చగా మారింది.
అసలు నిరసన కార్యక్రమానికి రూపకల్పన చేసింది ఎవరు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేంద్ర చట్టాలకు సానుకూలంగా అధిష్ఠానం మాట్లాడంతో ధర్నాను రద్దు చేసి ఉంటారనే చర్చ జోరందుకుంది. సోమవారం రాత్రి టెంట్ వేసినప్పటి నుంచి మంగళవారం ఉదయం టెంట్ తీసేసే మధ్యలో ఏం జరిగిందన్నది టీఆర్‌ఎస్‌లోనూ ఆసక్తిగా మారిందట. ఒకానొక దశలో వెనక్కి తగ్గితే ప్రజల్లో పరువు పోతుందని భావించిన ఎమ్మెల్యేలు.. వ్యవసాయ చట్టాల ప్రస్తావన లేకుండా ప్రాజెక్టుల కోసమే బుధవారం పోరు చేస్తామని చెప్పడానికి ప్రయత్నించారు. చివరకు అది కూడా విరమించుకున్నారు.
ఈ విషయంలో చురుకుగా పనిచేసిన ఓ ఎమ్మెల్యేకు పార్టీ అధిష్ఠానం నుంచి గట్టిగానే చీవాట్లు పడినట్టు చెవులు కొరుక్కుంటున్నారట. పూర్తిగా క్లారిటీ తీసుకోకుండానే రెండోసారి నిరసనకు సిద్ధపడటంపై పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారట. దీనిపైనా అధికారపార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతేకాదు.. వ్యూహ రచనలో ఆరితేరిన పార్టీకి చెందిన నాయకులు ఎందుకు హడావిడిగా నిర్ణయం తీసుకున్నారు ఎందుకు వెనక్కి తగ్గారు అన్నది కేడర్‌కు అర్థం కావడం లేదట.