“అందరూ కలిసి కట్టుగా ఎన్నికల్లో పార్టీసిపేట్ చేయాలి. వైసీపీకి ఒక్క వార్డు కూడా దక్కకుండా చేయాలి. అంతటా పసుపు జెం డాలే ఎగరాలి“- ఇదీ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు విజయవాడ టీడీపీ నాయకులు చేసిన ప్రతిజ్ఞ. అయితే, ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన రెండో రోజే ఈ ప్రతిజ్ఞను బుట్టదాఖలు చేశారు. ఇప్పుడు ఎవరిని కదిపినా.. ఎవరిని పలకరించినా.. ఎవరికి వారే.. ఎవరికోసం వారే కష్టపడాలి. అనే మాటలే వినిపిస్తున్నాయి. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు ఇలా జరిగింది? అనేది ప్రధాన ప్రశ్న. విజయవాడలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచిన గద్దె రామ్మోహన్, సెంట్రల్ నియోజకవర్గం నుంచి పాతిక ఓట్ల తేడాతో ఓడిపోయిన బొండా ఉమాలు నగరంలో చక్రం తిప్పుతున్నారు.
అయితే, విజయవాడ ఎంపీ స్థానం నుంచి గెలిచిన కేశినేని నాని మొత్తం నగరంపై ప్రభావం చూపించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే నేతల మధ్య ఆధిపత్య పోరు పెరుగుతోందనే భావన వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందు వరకు కూడా నాయకు లు అందరూ ఏకతాటిపైకి వచ్చి వైసీపీని మట్టి కరిపించి, మళ్లీ నగర కార్పొరేషన్‌ను టీడీపీకి దఖలు పరచాలని అనుకున్నారు.(గత ఎన్నికల్లో టీడీపీనే విజయవాడ కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది) ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ. తర్వాత రాత్రికి రాత్రి జరిగిన పరిణామాలు పార్టీలో చిచ్చు పెట్టాయి. బొండా ఉమా తన సతీమణి సుజాతను, గద్దె రామ్మోహన్ తన సతీమణి అనురాధను మేయర్ పీఠంపై కూర్చోబెట్టుకునేందుకు ఆశలు పెట్టుకున్నారు.
ఇంతలోనే అనూహ్యంగా(అప్పటి వరకు అసలు ఊసులో కూడా లేని) కేశినేని నాని రెండో కుమార్తె శ్వేత అరంగేట్రం చేశారు. వచ్చీ రాంవడంతోనే 11వ వార్డుకు ఆమె నామినేషన్ వేయడంతోపాటు.. ఏకంగా మేయర్ పీఠానికి ఆమె పేరును నామినేట్ చేశా రని, అది అధిష్టానమే నిర్ణయం తీసుకుందని వెల్లడించడంలో ఒక్కసారిగా అగ్గిరాజేసింది. ఈ ప్రకటనతో ఖిన్నులైన నాయకులు అప్పట్లోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు మౌనం వహించారు. అయితే, ఇప్పుడు దీనిపైనే తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. అంతర్గత చర్చల్లోనూ ఇదే విషయం ప్రస్తావనకు వస్తోంది. రెండు వర్గాలుగా ఉన్న నాయకులు ఇప్పుడు మూడు వర్గాలుగా మారిపోయి..
మేయర్ పీఠం కోసం కుమ్ములాడుకునే పరిస్థితి వచ్చింది. బొండా, గద్దె వర్గాలు తమవారికే ఇవ్వాలని పట్టుబడుతున్న సమయంలో మేయర్ పీఠం తమదేనని మీడియా ముఖంగా ప్రకటించిన కేశినేని వైఖరిపై వీరంతా మూకుమ్మడిగా మౌన నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈప రిణామాలు రాబోయే రోజుల్లో ఎంత దూరం వెళ్తాయో చూడాలి. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితిలో విజయవాడలో టీడీపీకి బలం చాలానే కనిపిస్తోంది. కానీ, నేతల మేయర్‌పీఠం కుమ్ములాటలు ఈ విజయాన్ని అందిస్తాయా.. తునాతునకలు చేస్తాయా? అనేది చూడాలి.