ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే నాయకుడు. ఉమ్మడి ఏపీలో తొమ్మిదేళ్లకు పైగా, ఇప్పుడు విభజన త ర్వాత ఏపీలో ఐదేళ్లు అధికారంలో ఉన్న సీఎం. కేంద్రంలోని 29 రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాలను కూడా చక్రం తిప్పినట్టు తిప్పుతానని, కేంద్రంలోని ప్రభుత్వాన్నికూడా మెడలు వంచుతానని చెప్పిన నాయకుడు చంద్రబాబు. ఇక, శాసనసభల పరంగా ఆయనకు ఉన్న అనుభవం కూడా అంతా ఇంతా కాదనేది నిజం. అలాంటి నాయకుడు మరి ఇప్పుడు వేస్తున్న అడుగులు.. చేస్తున్న రాజకీయం.. రచ్చ కూడా తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. రాష్ట్రంలో మూడు రాజధానుల ద్వారా అభివృద్ధిని వికేంద్రీక రిస్తామని చెబుతున్న జగన్ ప్రభుత్వం దీనికి అనుగుణంగానే బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది.
అయితే, మూడు రాజధానులు వద్దు అమరావతి మాత్రమే ముద్దు అని చెబుతున్న చంద్రబాబు.. దీనికి తగిన విధంగా అసెం బ్లీని, అటు శాసన మండలిని తనకు అనుకూలంగా మార్చుకుని తన వాదనను వినిపించడం ద్వారా ప్రజలకు చేరువ అయ్యేం దుకు ప్రయత్నించాలి. ఈ క్రమంలోనే తన ఫార్టీ ఇయర్స్ అనుభవాన్ని ఉపయోగించాలని అందరూ కొరుకున్నారు. కానీ, ఆయన మాత్రం తన అనుభవాన్ని పక్కన పెట్టి రచ్చ చేయడమే పరమావధిగా ముందుకు సాగుతున్నారు. తన ఎమ్మెల్యేలను ఎగదోస్తూ.. ముందుకు సాగుతున్నారు.
అసెంబ్లీలో ఏ పక్షానికైనా.. ఏ సభ్యుడికైనా నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంది. అయితే, ఈ హక్కును అడ్డు పెట్టుకుని మితిమీరి వ్యవహరిస్తున్నారనే విమర్శలు టీడీపీకి చుట్టుకున్నాయి. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులు చేస్తున్న రగడపై విశ్లేషకులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు. తమ వాదన చెప్పుకొనేందుకు అవకాశం ఉన్నా.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఛాన్స్ ఉన్నా.. చంద్రబాబు ఆతరహాగా కాకుండా .. సభను డామినేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ను చుట్టుముట్టి చేస్తున్న రగడపై ప్రజాస్వామ్య వాదులు నిశ్చేష్టులు అవుతున్నారు.
గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికార పక్షంగా ఉన్న టీడీపీ ఏ మేరకు ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇచ్చిందో అందరికీ తెలిసిందేనని, అయితే, ఇప్పుడు ఆ విషయాన్ని కూడా పట్టించుకోకుండానే ప్రతిపక్షానికి స్పీకర్ తగినంత సమయం ఇస్తున్నారనేది కూడా వస్తవమేనని చెబుతున్నారు. ఏదైనా విషయం ఉంటే.. మాట్లాడాలి. లేదా ప్రజాస్వామ్య యుతంగా నిరసన వ్యక్తం చేయాలే తప్ప.. ఇలా పోడియంను దాటి.. ఏకంగా స్పీకర్ చైర్ చుట్టూ చేరి గలాభా సృష్టించడం ద్వారా టీడీపీ అనుకున్నది సాధించకపోగా.. విమర్శల పాలవడం ఖాయమని అంటున్నారు. మరి బాబు ఇప్పటికైనా గుర్తిస్తారా? లేదా? చూడాలి.