బీకాంలో ఫిజిక్స్ చదివానంటూ.. ఒకప్పుడు సంచలనం చేసిన విజయవాడ నాయకుడు గుర్తున్నారా? ఇప్పుడు మరోసారి ఆయన వార్తల్లోకి వచ్చారు. తన దైన శైలిలో వ్యాఖ్యానించగల నాయకుడిగా మైనార్టీ నేతల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. నిజానికి ఆయన మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. వైఎస్‌తో మంచి అనుబంధం పెంచుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకుల్లో ఆయనకు తెలి యని, పరిచయం లేని నాయకుడు అంటూ ఎవరూ లేరు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఆయన పేరు మార్మోగింది మాత్రం బీకాంలో ఫిజిక్స్ చదివానని చెప్పుకొన్నప్పుడే. ప్రజలంతా కథకథలుగా ఆయన గురించి చదువుకుని పగలబడి నవ్వుకున్నారు.
తాజాగా ఆయన వార్తల్లోకి రావడం వెనుక ఈ విషయం లేకపోయినా.. ఆయన రాజకీయ వ్యూహం ఏంటనేది మాత్రం ఇప్పుడు ఆయన మళ్లీ వార్తల్లోకి ఎక్కించింది. 2014లో వైసీపీ తరఫున గెలవడం, తర్వాత మంత్రి పదవిపై మోజుతో ఆయన టీడీపీలోకి చేరిపోవడం.. ఈ క్రమంలోనే బీకాంలో ఫిజిక్స్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దీంతోఆయనకు మంత్రి పదవి దక్కలేదనే వాదన కూడా ఉంది. అయితే, ఆయన గత ఏడాది ఎన్నికల్లో తన కుమార్తె షబానా ఖటూన్‌ను రంగంలోకి దింపి పోటీ చేయించారు. అయితే, ఆమె ఘోరంగా ఓడిపోయి.. తిరిగి అమెరికా వెళ్లిపోయారు.
ఇక, ఇప్పట్లో ఎన్నికలు లేవు. అయితే, ఇప్పుడు తాజాగా జలీల్‌కు వచ్చిన కష్టం ఏంటంటే.. ఆయన ఆర్తికంగా ఇబ్బందులు పడుతున్నారట. కొన్నాళ్ల కిందట ఇదే విషయాన్ని టీడీపీ అదినేత చంద్రబాబుకు లేఖ రూపంలో రాశారని జలీల్ అనుచరులు చెబుతున్నారు. అయితే, దీనికి బాబు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఇక, టీడీపీలో ఉంటే కష్టమని భావించిన జలీల్ మళ్లీ వైసీపీ గూటికి చేరిపోవాలని బావిస్తున్నారు. కానీ, ఆయన వ్యూహం ఫలించే అవకాశం లేదని అంటున్నారు. కొన్నాళ్లుగా ఆయన వైసీపీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు.
గతంలో కాంగ్రెస్‌లో ఉండగా .తనకు మిత్రుడుగా ఉన్న కృష్ణా జిల్లా కు చెందిన సామినేని ఉదయభాను, పెనమలూరుకు చెందిన పార్థసారథిలో జగన్ వద్దకు రాయబారం పంపినట్టు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే, టీడీపీలోకి చేరిన తర్వాత జగన్‌ను జలీల్ ఖాన్ పలు సందర్భాల్లో దూషించారు. జగన్ అధికారంలోకి రావడం కాదు,.. అండమాన్ జైలుకు వెళ్తారంటూ.. సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో జలీల్ ఖాన్ పేరును జగన్ ముందు ఎత్తేందుకు కూడా నాయకులు భయపడిపోతున్నారట. దీంతో జలీల్ ఖాన్ ఆశలు తీరేవి కావని అంటున్నారు ఆయన అనుచరులు. మరి ఏం చేస్తారో చూడాలి.