ఇండోనేషియాలోని తూర్పు నుసా టెంగ్‌గారా ప్రావిన్స్‌లోని సముద్రంలో ప్రయాణిస్తున్న ఓడలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఓడలో ఉన్న వారు షాకయ్యారు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే మంటలు పూర్తిగా పడవను చుట్టుముట్టాయి.
ఈ ఘటనలో ఓడలో ఉన్న 14 మంది దుర్మరణం చెందారు. మంటలు అంటుకుని పలువురికి గాయాలయ్యాయి. ఓడ నుంచి 263 మందిని రెస్క్యూ దళాలు రక్షించాయి. ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఓడలో ఎంత మంది ప్రయాణిస్తున్నారనే దానిపై అధికారుల వద్ద సమాచారం లేకపోవడం వల్ల ఎంత మంది గల్లంతయ్యారనే విషయం అంచనా వేయలేకపోతున్నారు. మంటలు అంటుకోగానే ప్రయాణికులను మరో ఓడలోకి పంపించినట్లు రెస్క్యూ దళాధిపతి పుటు సుదయన తెలిపారు.
శాంతికా లెస్టారీ అనే ఈ ఓడ కుపాంగ్ నగరానికి సమీపంలోని జలాల్లో ప్రయాణిస్తుండగా అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజిమెంట్ ఏజెన్సీ సీనియర్ అధికారి రిచర్డ్ పెల్ట్ తెలిపారు. ప్రమాదానికి గురైన ఈ ఓడ కుపాంగ్ నగరంలోని ఓడ రేవు నుంచి బయల్దేరి ప్రావిన్స్‌లోని అలోర్ జిల్లాలకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.