అమరావతి రైతుల పాదయాత్ర ఆగిపోయినట్టే : మంత్రి బొత్స

-

అమరావతి రైతుల పాదయాత్రపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల పాదయాత్ర ఆగిపోయినట్లుగా భావిస్తున్నానని అన్నారు. ఏది ఏమైనా విశాఖ పరిపాలనా రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష సాకారం అయినట్టేనని అభిప్రాయపడ్డారు.

విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని.. వాటిని పరిష్కరించుకొని త్వరలోనే విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని హామీ ఇచ్చారు. భోగాపురం విమానాశ్రయం భూ సేకరణ, నిర్వాసితుల పునరావాస పనులు, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం భూసేకరణపై విజయనగరం కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

జిల్లాలోని భీమసింగి, సీతానగరం చక్కెర కర్మాగారాల పరిధిలో ఈ సీజన్‌లో రైతులు పండించిన చెరకును క్రషింగ్‌ కోసం శ్రీకాకుళం జిల్లాలోని చక్కెర కర్మాగారాలకు తరలింపు, రైతులకు చెల్లించే ధరపైనా అధికారులతో సమీక్షించారు. వచ్చే నెలలో భోగాపురం గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయం, గిరిజన విశ్వవిద్యాలయానికి ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతున్నామని మంత్రి బొత్స తెలిపారు. కొన్ని కోర్టు వివాదాలు ఉన్నాయని.. అవి త్వరలోనే పరిష్కారమవుతాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news