పాస్టర్ పొలంలో 39 మృతదేహాలు.. ఉపవాసం వల్లేనా..?

-

కెన్యాకు చెందిన ఓ పాస్టర్​ స్థలంలో 39 మృతదేహాలు లభ్యమవ్వడం స్థానికంగా కలకలం రేపింది. మృత్యువు దరిచేరే వరకు ఉపవాసం ఉండాలని పాస్టర్ తన అనుచరులకు సూచించాడు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పాస్టర్​ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పాస్టర్​ ఇల్లు, కార్యాలయాలు, పొలాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే పాస్టర్ పొలంలో 39 మృతదేహాలను పోలీసులు గుర్తించారు.

ఉపవాసం ఉంటూ అత్యంత నీరస స్థితికి చేరుకున్న మరికొంత మందిని గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. వీరిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని మలింది సబ్ కౌంటీ పోలీస్ చీఫ్ జాన్ కెంబోయ్ వెల్లడించారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 43కు చేరిందని వివరించారు. పాస్టర్ స్థలంలో మరిన్ని సమాధులు తవ్వాల్సి ఉందని స్పష్టం చేశారు.

భగవంతుడి కోసం ఉపవాసం ఉండాలని అనుచరులకు పిలుపునిచ్చిన కేసులో పాల్ మెకెంజీ అనే పాస్టర్​ను ఏప్రిల్ 14న పోలీసులు అరెస్ట్ చేశారు. మెకెంజీకి చెందిన స్థలాలతో పాటు ఆయన ప్రార్థనలు చేసే గుడ్​న్యూస్ ఇంటర్నేషనల్ చర్చ్​లో తనిఖీలు చేశారు. ఈ క్రమంలోనే స్థానికులు ఇచ్చిన సమాచారంతో చర్చ్​ను తనిఖీ చేశారు. అక్కడ కృశించిన స్థితిలో 15 మందిని గుర్తించారు. ఇందులో నలుగురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. జీసస్​ను కలుసుకునేందుకు పాస్టర్ సూచనతోనే ఉపవాసం చేస్తున్నామని ఆయన అనుచరులు చెప్పడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version