అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే చాలాసార్లు.. చాలా ప్రసంగాల్లో గందరగోళానికి గురయ్యారు. ఈ కన్ఫ్యూజన్లో బైడెన్ చాలాసార్లు నోరుజారి విమర్శలపాలయ్యారు. ఇక తాజాగా బైడెన్ మరో సారి గందరగోళం సృష్టించారు. బుధవారం రోజున విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఒక దేశానికి బదులు మరో దేశం పేరును ప్రస్తావించారు. బైడెన్ వృద్ధాప్యం కారణంగానే ఇలా గందరగోళంగా మాట్లాడుతున్నారని కొందరు విమర్శిస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. షికాగో పర్యటన నిమిత్తం జో బైడెన్ వైట్ హౌస్ నుంచి బయలుదేరే ముందు విలేకర్లు బైడెన్‌ను ‘ఉక్రెయిన్ను ఓడించేందుకు యత్నిస్తున్న పుతిన్‌కు వ్యతిరేకంగా వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు చేయడంతో ఆయన బలహీనపడ్డారా..?’ అని ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ బైడెన్.. ‘‘ఇరాక్ తో జరుగుతున్న యుద్ధంలో అతడు(పుతిన్) ఓడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. స్వదేశంలో అతడికి వ్యతిరేకత ఎదురవుతోంది. అతడు ఏకాకిగా మిగిలుతున్నాడు. కేవలం నాటో కూటమే కాదు.. ఐరోపా సమాఖ్య, జపాన్ ఇలా దాదాపు 40 దేశాలు ఆయన్ను ఒంటరి చేశాయి’’ అని ఉక్రెయిన్‌కు బదులు ఇరాక్ పేరును పొరబాటున ప్రస్తావించారు.