అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్నారు. నిద్రకు సంబంధించిన తీవ్రమైన స్లీప్ ఆప్నియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. గత కొన్ని వారాలుగా ఆయన సీప్యాప్ (కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్) యంత్రాన్ని వాడుతున్నారని వైట్‌హౌస్ బుధవారం తెలిపింది. ఆయన వైట్‌హౌస్ నుంచి బయటకు వచ్చిన సమయంలో ముఖంపై గీతలు ఉండటంతో ఈ విషయాన్ని వెల్లడించాల్సి వచ్చిందని పేర్కొంది. అధ్యక్షుడు దాదాపు 2008 నుంచి స్లీప్ ఆప్నియా అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నారని వెల్లడించింది.
వాస్తవానికి స్లీప్ ఆప్నియా అనేది చాలా మందిలో కనిపించే ఓ తీవ్రమైన సమస్య. నిద్రలో ఉన్న సమయంలో గాలిపీల్చుకోవడం తరచూ ఆగిపోతూ ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు రాత్రి మొత్తం నిద్రపోయినా.. ఉదయం పూట అలసిపోయినట్లు ఉంటారు. అమెరికాలో 3 కోట్ల మందిలో ఇటువంటి సమస్య ఉండొచ్చని అంచనా. దీంతో పాటు గురక సమస్య కూడా ఉంటుంది. సీప్యాప్ యంత్రాన్ని బైడెన్ మంగళవారం రాత్రి కూడా వాడాల్సి వచ్చిందని శ్వేతసౌధం అధికారులు వెల్లడించారు. బైడెన్ షికాగోలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఆయన ముఖంపై గీతలు కనిపించాయి.