ఇటీవల చైనా ఈస్టర్న్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం కుప్పకూలింది. ఆరు రోజుల క్రితం కున్మింగ్ నుండి చైనా దక్షిణ నగరమైన గ్వాంగ్జౌకు ప్రయాణిస్తుండగా గ్వాంగ్జీ ప్రాంతంలో పర్వతాల్లో కూలిపోయింది. ఈ ప్రమాదం లో 132 మంది మృతిచెందినట్లు అధికారికంగా వెల్లడించింది. ప్రమాదం జరిగిన తర్వాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పర్వత ప్రాంతాల్లో కూలిపోవడం వల్ల సహాయక చర్యలు కూడా ఆలస్యం అయ్యాయి. రెస్క్యూ సిబ్బంది అనేక రోజులు గాలించినా.. ప్రయాణికుల ఆచూకీ లభించకపోవడవతో మొత్తం 132 మంది మరణించినట్లు ధ్రువీకరించారు. కూలిన విమానం బోయింగ్ 737 రకానికి చెందినది. ఇదిలా ఉంటే ఘటన స్థలం నుంచి తాజాగా రెండో బ్లాక్ బాక్స్ లభ్యం అయింది. నాలుగు రోజుల క్రితమే కాక్ పిట్ వాయిస్ రికార్డ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫ్లైట్ డాటాను తెలిపే బ్లాక్ బాక్స్ ను వెతకగా..తాజాగా ఇది కూడా లభించింది. ఈ రెండింటి ఆధారంగా అసలు ప్రమాదానికి కారణాలను విశ్లేషించనున్నారు.