తైవాన్‌పై చైనా యుద్ధ మేఘాలను ఆవరించింది. ఆ దేశాన్ని భయపెట్టే ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. భారీ సంఖ్యలో యుద్ధ నౌకలు, విమానాలను.. గత రెండు రోజులుగా తైవాన్ దిశగా తరలిస్తోంది డ్రాగన్ దేశం. మొదట చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 38 యుద్ధ విమానాలు, 9 యుద్ధ నౌకలను తైవాన్ చుట్టూ మోహరించాయి. తర్వాత జే-10, జే-16 ఫైటర్ జెట్లు, 32 యుద్ధ విమానాలు తైవాన్ జలసంధిలోని ఇరు దేశాల అనధికారిక సరిహద్దు అయిన మిడ్‌లైన్‌ను దాటాయి. తైవాన్ నిర్వహించనున్న వార్షిక సైనిక విన్యాసాల నేపథ్యంలో.. చైనా ఈ చర్యలకు పాల్పడింది.
స్వతంత్ర పాలనలో ఉన్న తైవాన్‌పై అధికారం తమదేనని చైనా ఎప్పటినుంచో వాదిస్తోంది. అందులో భాగంగానే తైవాన్ జలసంధి, గగనతలంలోకి.. చైనా పలుమార్లు యుద్ధ నౌకలను, డ్రోన్లను సరిహద్దులకు పంపుతోంది. తైవాన్ స్వాతంత్య్రమనే మాటకు.. ఈ అంశంలో విదేశీ శక్తుల జోక్యానికి చోటు ఇవ్వలేమని ఇది వరకే స్పష్టం చేసింది.