ప్రపంచంలోని అతి పేద దేశాల్లో ఒకటైన సూడాన్ అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్నది. గత కొద్ది రోజులుగా దేశంలో తుపాకుల మోత మోగుతోంది. రెండు వర్గాలుగా విడిపోయిన సైనిక కమాండర్లు అధికారం కోసం ఒకరి మీద మరొకరు దాడులు చేసుకుంటున్నారు. దీంతో లక్షల కొద్ది ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దేశం విడిచి వెళ్లిపోతున్నారు. భారీగా ఆస్తులు ధ్వంసమవుతుండటంతోపాటు జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఏప్రిల్ 15న సూడాన్ సాధారణ మిలిటరీ, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ఆర్‌ఎస్‌ఎఫ్ పారామిలిటరీ బలగాల మధ్య ప్రారంభమైన ఆధిపత్య పోరాటం వల్ల ఇప్పటివరకు 3,30,000 మందికి పైగా ప్రజలు వారివారి స్వదేశాలకు వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. మరో లక్ష మందికిపైగా సరిహద్దులు దాటి పారిపోయారని తెలిపింది. మొత్తంగా దేశం నుంచి 4 లక్షల 30 వేల మందికిపైగా దేశం నుంచి వెళ్లిపోయారని పేర్కొంది.