నెలల వ్యవధిలో ఇన్ఫోసిస్ నుంచి మరో కీలక వ్యక్తి వైదొలిగారు. తాజాగా సంస్థ ప్రెసిడెంట్ మోహిత్ జోషీ తన పదవికి రాజీనామా చేసినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీకి కంపెనీ సమాచారమిచ్చింది. ‘’‘ఇన్ఫోసిస్ అధ్యక్షుడు మోహిత్ జోషీ నేడు రాజీనామా చేశారు. మార్చి 11 నుంచి ఆయన సెలవులో ఉండనున్నారు. జూన్ 9, 2023.. కంపెనీలో ఆయన చివరి పనిదినం’’’ అని సంస్థ తన ప్రకటనలో వెల్లడించింది.
ఇన్ఫోసిస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్/లైఫ్ సైన్సెస్ బిజినెస్‌కు నేతృత్వం వహిస్తున్న మోహిత్ జోషీ.. 2000 సంవత్సరంలో సంస్థలో చేరారు. రెండు దశాబ్దాలకు పైగా సంస్థలో విభిన్న స్థాయుల్లో పనిచేశారు. ఎడ్జ్వర్వ్ సిస్టమ్స్‌కు ఛైర్మన్‌గానూ వ్యవహరించారు. ఇన్ఫోసిస్‌ను వీడిన జోషీ.. మరో టెక్ సంస్థ టెక్ మహీంద్రాలో చేరారు. ఈ మేరకు టెక్ మహీంద్రా ఓ ప్రకటనలో ఈరోజు వెల్లడించింది. జోషీని.. తమ నూతన మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పేర్కొంది. ప్రస్తుత టెక్ మహీంద్రా ఎండీ, సీఈఓ సీపీ గుర్నానీ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నట్లు సంస్థ తమ ప్రకటనలో తెలిపింది.